తడిసిన ధాన్యం కొనండి.. రైతులకు అండగా నిలవండి

` ధాన్యం కొనుగోలులో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం
` చివరి గింజ వరకు కొనుగోలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధం
` రబీ సీజన్‌లో 60.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
` 2023 రబీతో పోలిస్తే 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అధికం
-మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ధాన్యం కొనుగోలు అంశంలో బి.ఆర్‌.ఎస్‌ అసత్యప్రచారనికి పూనుకుని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విరుచుకుపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ రబీ సీజన్‌ లో ఈ రోజు సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన గణాంకాలతో వెల్లడిరచారు.అదే బి.ఆర్‌ ఎస్‌ పాలన లో అంటే 2022-23 రబీ సీజన్‌ లో నాటి పాలకులు మే 22 నాటికి కొనుగోలు చేసింది కేవలం 36.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే నని ఆయన పేర్కొన్నారు.బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాగు అయిన చివరి రబీ సీజన్‌ లో నాటి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో పోల్చి చూస్తే ఈ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత రబీ సీజన్లో అదే మే 22 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసిందన్నారు.ఈ గణాంకాలే బి.ఆర్‌.ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిదర్శనమన్నారు.చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న రైతాంగ అనుకూల విధానాలతో అటు ఖరీఫ్‌ ఇటు రబీ లోనూ రికార్డు స్థాయిలో ధాన్యాం దిగుబడి అయ్యిందన్నారు.అత్యధికంగా దిగుబడి అయిన ధాన్యం దిగుబడిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను పెద్ద సంఖ్యలో పెంచామని ఆయన తెలిపారు.