కొత్త పార్టీలకు ఊపిరి పోస్తున్న టిఆర్‌ఎస్ !
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల సందడి మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత అవి మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపిలు ఉండగా ఎపికి చెందిన షర్మిల రాజన్న రాజ్యం అంటూ వైసిపి తెలంగాణ పార్టీని ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నారు. అలాగే ఐపిఎస్‌కు రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బిఎస్పీలో చేరి రాజకీయ ఎజెండాను ప్రకటించారు. ఎన్నికల నాటికి మరిన్ని రాజకీయ పార్టీలు పుట్టుకు రావచ్చు. ఈ కోవలో ఇప్పటికే కోదండరామ్ పార్టీ కూడా ఉంది. పార్టీలన్నీ కులాలు,మతాలు, వర్గాల విూద ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే ఇవన్నీ ఎదగడానికి మాత్రం కేవలం కెసిఆర్, టిఆర్‌ఎస్ వైఖరే అని చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలు అవలంబిస్తే ప్రజలు ఇతర పార్టీలవైపు మొగ్గు చూపుతారనడానికి కొత్త పార్టీల పుట్టుకను ఉదారణగా తీసుకో వాలి. నిజానికి ఇన్ని పార్టీలు ఎందుకు వస్తున్నాయన్నది ఆలోచించాలి. అయితే ప్రధానంగా టిఆర్‌ఎస్ ప్రజలకు దూరంగా ఉంటూ..పాలకులు ప్రజలను దరికి చేరనివ్వకపోవడమే కారణంగా చూడాలి. ప్రజాస్వా మ్యంలో అధికార యంత్రాంగం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ కెసిఆర్ సిఎం అయ్యాక అలాంటి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలు కూడా ఇతర పార్టీలకు అవకాశాం ఇచ్చేలా కనిపిస్తు న్నారు. ప్రస్తుతం, తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో వేళ్లూనుకుని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తామంటూ కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అయితే చాలా వరకూ కొత్త పార్టీలు ఇలా వచ్చి అలా కనుమరుగైపోతుంటాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.. నిస్తేజంగా ఉన్న బీఎస్పీలో చేరడం ద్వారా అసాధారణంగా ఏవిూ చేస్తారన్నది ప్రశ్న. ఉత్తరాదిలో బిఎస్పీ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టి మాయావతి ఏకాకి అయ్యారు. మారుతున్న రాజకీయ సవిూకరణాల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు నడపాలంటే డబ్బులు ముఖ్యం. ఈ కారణంగానే తెలంగాణ జెఎసి ఛైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ పెట్టినా ప్రజలకు దగ్గర కాలేకపోయారు. కారణాలు ఏవైనా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలే టిఆర్‌ఎస్ ముందు పేలిపోతు న్నాయి. పదవుల కోసం ప్రస్తుతం ఉన్న రాజకీయపార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా వాటిని తీసుకోకుండా ప్రవీణ్ బిఎస్పీలో చేరడం ద్వారా బహుజనులను ఏకం చేయడం సాధ్యం కాకపోవచ్చు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల ఏర్పాటును చూస్తుంటే వారంతా టీఆర్‌ఎస్ బలహీనంగా ఉందని భావిస్తున్నట్లు కనిపి స్తోంది. కానీ బలమైన పునాదులతో టిఆర్‌ఎస్ ఉందన్న విషయాన్ని మరవరాదు. తెలంగాణ రాజకీయాలు 1956 నుంచి 2014 వరకూ ఉమ్మడి ఆంధప్రదేశ్‌తో ముడిపడి ఉన్నాయి. పెద్ద లీడర్లు, కులాల గ్రూపులు పెద్ద రాష్టాల్రకు సరిపోతాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో ఈ గ్రూపులు తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నాయి. అయితే చిన్న రాష్ట్రమైన తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఉన్నాయి. కేరళలో దాదాపు తెలంగాణలో ఉన్నంత జనాభానే ఉంది. అక్కడ సుమారు 30 రాజకీయ పార్టీలు చురకుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ఎంఐఎం, రెండు లెప్ట్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రెండు పార్టీలు వచ్చాయి. అందులో ఒకటి షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ, ఇంకొకటి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేరిన బీఎస్పీ పార్టీ. షర్మిల పార్టీ ఏర్పాటు గురించి ఎప్పటి నుంచో వార్తలు రావడం, పార్టీ ప్రకటించడం,ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. ఆర్థికంగా బాగా ఉన్న షర్మిల డబ్బులు ఖర్చు పెడతారన్న భావనా ఉంది. దీనికితోడు తండ్రి ఛరిష్మాను క్యాష్ చేసుకుని ముందుకు పోతున్నారు. దీంతో నష్టపోయేది కాంగ్రెస్ తప్ప టిఆర్‌ఎస్ కాదు. ఇక రాష్ట్రంలో
బీఎస్పీ ఎప్పటి నుంచో ఉన్నా దాని ఉనికి చాలా పరిమితం. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది కష్టమే. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి, మరిన్ని పార్టీలు పుట్టుకు వచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు. కొత్త పార్టీలు ఏర్పాటైనప్పుడు పెద్ద సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీల పవర్‌పై ప్రభావం పడుతుంది. కొత్త రాజకీయ పార్టీ అప్పటి వరకూ ఉన్న పార్టీలు ప్రభావం చూపిస్తా యనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంక్‌తో నడుస్తున్న ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ తెలంగాణలో గొప్ప హోదాను పొందుతోంది. కచ్చితంగా గెలిచే ఏడుగురు ఎమ్మెల్యే లతో తాను ఎంత ముఖ్యమో ఒవైసీ స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఒక ఎంపి స్థానం కూడా వారు గెలుస్తూనే ఉన్నారు. అయినా వారు అధికార టిఆర్‌ఎస్‌కు అంటకాగి ముందుకు సాగుతున్నారు. పరస్పర ఆదానంగా వారి మద్దతు నడుస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల్లో ముస్లిం ఓట్లను టిఆర్‌ఎస్ దక్కిచుకో గులుతోంది. అయితే కొత్త పార్టీలు ఏర్పాటైతే, ఎంఐఎం తన ప్రాముఖ్యతను కోల్పోతుందన డానికి లేదు. ఒకవేళ కొత్త పార్టీలు కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినా, అప్పుడు ఎంఐఎం అవసరం లేకుండా పోతుంది. అందువల్ల కొన్ని కొత్త పార్టీలతో ఎంఐఎం పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తనకు తాను పునరుత్తేజం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. పిసిసి చీఫ్‌గా రేవంత్ నియామకం తరవాత కాంగ్రెస్‌లో కొంత ఊపు వచ్చింది. యువకుడు, మాటకారి అయిన రేవంత్ రెడ్డి సహజంగానే ఇతర వర్గాలను, పార్టీని వీడి వెళ్లిన వారిని కాంగ్రెస్ వైపు ఆకర్శిస్తున్నారు. కాంగ్రెస్‌లోని నాయకత్వం అంతా ఇప్పుడు రేవంత్‌కు అనుకూలంగా మారుతోంది. గతంలో లాగా గ్రూపులకు అవకాశం లేకుండా రేవంత్ జాగ్రత్త పడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్‌తో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎంపిలుగా గెలిచారు. ఇక బిజెపి నుంచి అనూహ్యంగా నలుగురు ఎన్నికయ్యారు. ఇదంతా కెసిఆర్ అనుసరించిన నిరంకుశ విధానాల కారణంగానే అని చెప్పుకోవాలి. ఆయన ఈ ఒక్కటి వీడితే ఇతర పార్టీలకు అడ్రస్ ఉండకపోవచ్చు. గతంలో ఉద్యమ సమయంలో ఉన్నకెసిఆర్‌లాగా అందరినీ ఆదరిస్తే కెసిఆర్ మల్లీ త్రివిక్రముడవుతాడనడంలో సందేహం లేదు. టిఆర్‌ఎస్ పట్ల విముఖత కారణంగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ ఊహించని స్థాయిలో కాంగ్రెస్ 3, బిజెపి 4 ఎంపీ సీట్లు సాధించింది. రెడ్డి, వెలమ దొరలు బీజేపీతో పాటు అన్ని పార్టీలకూ విస్తరించారు. ఓటర్లలో గందరగోళం ఏర్పడటం వల్ల బీజేపీ కూడా కొత్త పార్టీలతో ప్రభావిత మవుతుంది. తెలంగాణలో 2023 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌లో అత్యంత అనుభవం కలిగిన మంచి లీడర్లు ఉన్నారు. కొత్త పార్టీలు కచ్చితంగా ఆయా వర్గాలను ఆసరాగా చేసుకునే పుట్టుకుని వస్తున్నాయి. ఒకవేళ టీఆర్‌ఎస్,అధినేత కెసిఆర్ ప్రజలకు చేరువగా ఉంటే కొత్త పార్టీలకు కళ్ళెం పడుతుంది. ప్రజలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా నిరంకుశ విధానాల కారణంగానే కెసిఆర్ ప్రజలకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు.