కొత్త బంధాలు చిగురిస్తున్నాయి

5

-సుష్మా స్వరాజ్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌14(జనంసాక్షి): పాకిస్థాన్‌తో సంబంధాలను పునరుద్ధరించిన అంశంపై రాజ్యసభలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటన చేశారు.వచ్చే ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లో పర్యటిస్తారని సుష్మా తెలిపారు. తాను పాక్‌ ప్రధాని షరీష్‌ను కలిసిన తర్వాత రెండు దేశాల మధ్య కొత్త సంబంధాలు చిగురించాయన్నారు. వచ్చే ఏడాది ఇరు దేశాల ప్రధానులు, జాతీయ భద్రతా సలహాదారుల మధ్య సమావేశాలు ఉంటాయని సుష్మా తెలిపారు. అయితే ఆ ప్రకటనను విపక్షాలు అడ్డుకున్నాయి. ఢిల్లీలో గుడిసెల కూల్చివేతను నిరసిస్తూ ప్రతిపక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. నినాదాలతో ¬రెత్తించారు. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి సుష్మా ప్రకటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో గుడిసెలను ఎందుకు కూల్చారో చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో కొంత గందరగోళం నెలకొంది. పేదలపై ప్రభుత్వం కక్ష కట్టిందని విపక్షాలు దుయ్యబట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలోని షాకుర్‌ బస్తీలో నిన్న పేదల గుడిసెలను రైల్వేశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి కూల్చివేసిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతిచెందారు. అయితే ఈ దుర్ఘటనపై ఇవాళ ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. మురికి వాడల్లో నివసిందే పేద ప్రజలపట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించాయి. దీంతో సంబంధిత రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఇందుకు సంబంధించి సభలో ప్రకటన చేశారు. అధికారులు సరియైన విధంగానే నిబంధనల ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఇందులో అధికారుల దోషం లేదన్నారు. అక్రమంగా వేసుకున్న గుడిసెలను తొలగించారని అన్నారు.