కొత్త మండలాల కోసం ప్రజల ఆందోళన

పలుచోట్ల రాస్తారోకోలు..వంటావార్పులు
ప్రకటన వచ్చే వరకు ఆందోళన చేస్తామంటున్న స్థానికులు

హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): ఇటీవల ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటన తర్వాత రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌, నల్గొండ, ములుగు, సిరిసిల్లతో పాటు ఇతర జిల్లాల్లో నిరసనలు కొనసాగాయి. స్పష్టమైన హావిూ వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆదిలాబాద్‌ జిల్లా సొనాల వాసులు అంటున్నారు. అటు ములుగు జిల్లా మల్లంపల్లిలో బుధవారం నిరసనలు కొనసాగించారు. ములుగు`ఏటూరునాగారం మార్గంలో రాస్తారోకోతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలం చేయాలని రెండోరోజు గ్రామస్థులు ధర్నా చేశారు. మొన్న ప్రభుత్వం ప్రకటించిన మండలాల లిస్టులో తమ ఊరి పేరు లేకపోవడంపై మల్లంపల్లి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు`హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఇవాళ కూడా ధర్నా చేశారు. దీంతో రాకపోకలకు మరోసారి అంతరాయం ఏర్పడిరది. అటు సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలోనూ నిరసలు చేపట్టారు. మండలానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలను కలుపుకొని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని గోదావరిఖని`మంథని ప్రధాన రహదారిపై ధర్నా గ్రామస్తులు ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అరూర్‌ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వలిగొండ ` తొర్రూర్‌ రహదారిపై అరూర్‌ స్టేజి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 37 గ్రామపంచాయతీలు ఉన్న వలిగొండ మండలంను రెండుగా విభజించి, అరూర్‌ మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం సోనాల వద్ద గ్రామస్తుల రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. జాతీయ రహదారి దిగ్భందించడంతో ట్రాఫిక్‌ పెద్ద ఎతున్న స్తంభించిపోయింది.
సోనాల గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. ఇనుగూర్తి వద్దు`నెల్లికుదురు ముద్దు అంటూ రాజుల కొత్తపల్లి గ్రామస్థులు నెల్లికుదురు అంబేద్కర్‌ సెంటర్‌ లో రాస్తారోకో చేశారు. ఆందోళనకారులుకు, పోలీసులకు
మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. ఇనుగూర్తి మండలంలో తమ గ్రామాన్ని కలపొద్దు అంటూ అందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలం కీతవారిగూడెంను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. కోదాడ` మిర్యాలగూడ రోడ్డుపై అఖిలపక్షల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.