కొద్దిగా తెరిపిచ్చిన వానలు

తగ్గుముఖం పట్టిన వరుణుడి జోరు
హైదరాబాద్‌కు ఊరటనిచ్చిన వాన

హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): రాష్ట్రంలో గత ఐదారు రోజులుగా దంచి కొట్టిన వానలు కొంత తెరిపినిచ్చాయి. కొన్ని జిల్లాల్లో అడపాదడపా వానలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో గురువారం నుంచి ఆకాశం తెరిపిచ్చింది. శీతల గాలులుమాత్రం కొనసాగుతున్నాయి. ఐదారు రోజులుగా ఆకాశానికి చిల్లు పడిరదా అన్న తీరులో పట్టణాలు, పల్లెలను వానలు ముంచెత్తాయి. తెలంగాణలో 34 ఏండ్ల తర్వాత అంతటి భారీ వర్షాలు పడ్డాయి. నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయని వెల్లడిరచింది. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. తెలంగాణలో ఓవైపు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుండగా, కొన్ని ప్రాంతాల్లో అతిస్వల్ప వర్షాలు కురిసాయి. బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో 39.10 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. కాగా, అతితక్కువగా సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో మైనస్‌ 20 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వెల్లడిరచింది. 34 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో జూలైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ రికార్డులు చెప్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన వల్లకొండ సరస్వతి పురిటి నొప్పులతో బాధపడుతున్నది. ఆమెకు సాయం చేసేందుకు ఐదుగురు సభ్యుల సింగరేణి రెస్క్యూ టీం అక్కడికి బయల్దేరింది. ఈ క్రమంలో బృందంలోని ఇద్దరు గల్లంతయ్యారు. సాయంత్రం వరకు గాలించినా వారి అచూకీ లభించలేదు. గురువారం ఉదయం వారి మృతదేహాలను కునగొన్నారు. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌లో పాత ఇల్లు కూలి నిద్రిస్తున్న వృద్ధుడు మృతిచెందాడు. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ నాగరత్నం తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని చెప్పారు. రాత్రి సమయంలో భారీ
నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు.రాష్ట్రంలో భారీ వర్షాలతో జరుగుతున్న నష్టం, తీసుకోవాల్సిన సహాయక చర్యలపై సీఎం కేసీఆర్‌ వరుస రివ్యూలు చేసి దిశా నిర్దేశంచేశారు. ముంపు గ్రామాలు, ప్రాంతాల్లోని జనాన్ని రక్షించేలా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేశారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అలర్ట్‌గా ఉండాలన్నారు. భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షలు నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయ, రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ యంత్రాంగం తరలించేలా ఆదేశాలిచ్చారు.