కొద్ది జాగ్రత్తలతో..
తలసేమియాను అదుపు చేయగలం
– ప్రసూతిలలో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ది రెండవ స్థానం
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
– మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో తలసేమియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
మహబూబ్‌నగర్, జూన్2(జనం సాక్షి) : కొద్ది జాగ్రత్తలతో తలసేమియా వ్యాధిని అదుపు చేయగలమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం ఆస్పత్రిలో తలసేమియా, హీమోఫిలియా డే కేర్ సెంటర్‌ను మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కొద్దిపాటి జాగ్రత్తలతో తలసేమియా వ్యాధిని అదుపు చేయగలమని చెప్పారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తలసేమియా వ్యాధికి చికిత్స కాస్త ఖర్చుతో కూడుకున్నది. హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న తలసేమియా చికిత్స.. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ వ్యాధి నివారణకు సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. గతంలో ధీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం సరిగా లేక పేద ప్రజలు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం ఆపరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని విభాగాలను బలోపేతం చేసి అన్ని రకాల వైద్యాన్ని అందుబాటలో ఉంచుతున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే గర్భిణీలు, పేద రోగులు ఇబ్బందులు పడేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మెరుగైన వసతులు కల్పించటం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న ఈ వ్యాధిగ్రస్తులకు ఈసెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రసూతిలలో మహబూబ్‌నగర్ జిల్లా రెండో స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ కిట్‌ల వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందజేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్, మంత్రి లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.