కొనసాగుతున్న  భూ నిర్వాసితుల ఆందోళన

14వరోజుకు చేరుకున్న నిరసనలు
మహబూబ్‌నగర్‌,మే20(జ‌నంసాక్షి): తమకు సత్వర న్యాయం చేయాలని కోరుతూ  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పక్షం రోజులుగా ఆందోలన చేస్తున్నాపట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీరు దీక్షలు చేపట్టి సోమవారం నాటికి 14 రోజులకు చేరింది.
కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం పోతిరెడ్డిపల్లి శివారులోని వట్టెం జలాశయ పనుల వద్దకు చేరుకున్న నిర్వాసితులు పనులు జరగకుండా అడ్డుకున్నారు. అక్కడే టెంటు వేసుకొని కళ్లకు గంతలు కట్టుకొని మాకు వెంటనే పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సాయంత్రం వరకు అలాగే నిరసన తెలపడం విశేషం. వారికి భాజపా, కాంగ్రెస్‌, తెదేపా, ఏఐటీయూసీ, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. జీగుట్టతండా, వెంకాయపల్లి, పోతిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 70 మంది నిరసనలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  రాంరెడ్డిపల్లి తండావాసులు ఒంటికాలుపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతలు తమను భయాందోళనకు గురిచేస్తూ దీక్షను భగ్నం చేసేందుకు యత్నిస్తున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పరిహారం అందించాలని సవాల్‌ విసిరారు. విపక్ష నేతలు మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలన్నారు. వారికి పరిహారం చెల్లించడంలో ఎందుకు వివక్ష చూపాలన్నారు. వారి సమస్యను ప్రబుత్వం తోణమే పరిష్కరించాలని బిజెపి ప్రధాన కార్యదర్శి ఆచారి డిమాండ్‌ చేశారు.