కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులకు అధికారుల సూచన
జనగామ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధర పొందాలని మార్కెటింగ్‌ అధికారులు  సూచించారు.  తూకాల్లో మోసం జరుగకుండా డిజిటల్‌ విూటర్లు ఏర్పాటు చేశాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యం విక్రయించాలన్నారు. ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకుంటోంది. ధాన్యం డబ్బును బ్యాంకు ఖాతాలో వేయడంతో పాటు తూకాల్లో ఎలాంటి మోసాలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిని అన్నదాతలు అర్థం చేసుకుని ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. ఇదిలావుంటే అన్నదాతను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రతీ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పంటను తరలించేందుకు అయ్యే ఖర్చును తగ్గిచ్చేందుకు చేపట్టిన కృషిని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. డిజిటల్‌ తూకం మిషన్‌, మద్దతు ధరతో పాటు సకాలంలో రైతులకు డబ్బులు అందిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 40 కేజీలకు మాత్రమే తూకం వేస్తున్నారు. 17 శాతం తేమ కలిగిన వరి ధాన్యాన్ని పరీక్షించేందుకు మ్యాక్చర్‌ మిషన్‌, అనాల్సిన్‌ మిషన్లను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. గత ఏడాదితో పోలిస్తే బోనస్‌ కలుపుకొని ఈసారి వరి ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర ఏ గ్రేడ్‌ రూ.1790, బీ. గ్రేడ్‌ రూ.1750 నిర్ణయించడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ధాన్యం కొనుగోలు అమ్మకునేందుకు  దళారులను ఆశ్రయించడంతో పాటు ఇతర ప్రాంతాలకు  వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనిని గమనించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో (వెలుగు) గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.  రైతులు వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు చేరుస్తున్నారు. రైతుల వద్ద నుంచి పట్టాదారు పాస్‌ పుస్తకం, బ్యాంకు పాస్‌ బుక్‌, ఆధార్‌ నంబర్లను సేకరించి తేమ 17 శాతం వరకు
ఉంటేనే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల అకౌంట్లలో నాలుగైదు రోజుల్లో నగదు చేరేలా చర్యలు చేపడుతున్నారు.

తాజావార్తలు