కొలిక్కి వస్తున్న మల్లన్నసాగర్‌ వ్యవహారం

మనసు మార్చుకుని భూములు ఇస్తున్న రైతులు

సిద్దిపేట,జనవరి18(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. ఇప్టపి వరకు మొండికేసిన రైతులు తమ మనసు మార్చుకుని భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మొదటి నుంచీ ఈ రిజర్వాయర్‌కు భూములను ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్న రైతులు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ మనసు మార్చుకుని భూమిని ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. దాంతో గత నెల రోజుల్లోనే సుమారు 900 ఎకరాలను అధికారులు సేకరించగలిగారు. మొదట భూసేకరణను వ్యతిరేకిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్‌, పల్లెపహడ్‌, వేములఘాట్‌ గ్రామాల రైతులు పోరాటాలు చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దిగివచ్చి చర్చలు జరపడంతో ఏటిగడ్డ కిష్టాపూర్‌, పల్లెపహడ్‌ గ్రామాల రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు.సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల సరిహద్దులో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే 13,870 ఎకరాలను అధికారులు సేకరించారు. మరో 100 ఎకరాలను సేకరిస్తే.. ఈ రిజర్వాయర్‌కు అవసరమైన భూ సేకరణ పక్రియ పూర్తయినట్టే. ఈ భూమిని కూడా రెండు మూడు రోజుల్లో సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేములఘాట్‌ రైతులు మాత్రం భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ గ్రామంలోని 70 శాతం భూమిని అధికారులు సేకరించారు. మిగిలిన 30 శాతం అంటే దాదాపు 950 ఎకరాల భూమిని రిజిస్టేష్రన్‌ చేయడానికి రైతులు ససేమిరా అన్నారు. వీరితో సీఎం కేసీఆర్‌ సైతం చర్చలు జరిపినా విఫలమయ్యాయి. తాజాగా మరోసారి చర్చలు జరిపిన అధికారులు ఎకరాకు రూ.7.75లక్షలు అందించేందుకు ముందుకు రావడంతో రైతులు అంగీకరించారు. గడిచిన పది రోజులుగా సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భూమిని ప్రభుత్వం పేరిట రిజిస్టేష్రన్‌ చేశారు.

తాజావార్తలు