కొలువుదీరిన కుమారస్వామి మంత్రివర్గం

ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు
బెంగళూరు, జూన్‌6(జ‌నం సాక్షి) : కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని మంత్రివర్గం కొలువుదీరింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు గడిచిన అనంతరం మంత్రి పదవుల కేటాయింపుపై స్పష్టత రావడంతో బుధవారం మంత్రులతో గవర్నర్‌ వజుభాయి వాలా రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్యనేత, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన డీకే. శివకుమార్‌కు నీటిపారుదల, వైద్యవిద్య మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కాంగ్రెస్‌ నుంచి 14 మంది, జేడీఎస్‌ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ¬ం శాఖ కాంగ్రెస్‌కు అప్పగించగా, ఆర్థిక శాఖ జేడీఎస్‌కు దక్కింది. బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మహేశ్‌కు మంత్రి వర్గంలో చోటు లభించింది. ఉత్తరప్రదేశ్‌ వెలుపల మంత్రి పదవి దక్కిన తొలి బీఎస్పీ ఎమ్మెల్యే ఈయనే. కేజీపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి దక్కింది.
కాంగ్రెస్‌ పార్టీ నుంచి మంత్రి పదవులు దక్కిన వారు..
డీకే శివకుమార్‌, ఆర్‌ వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్‌, శమనూరు శివశంకరప్ప, కేజే జార్జ్‌, కృష్ణ బైర్‌ గౌడ, రాజశేఖర్‌ పాటిల్‌, ప్రియాంక ఖర్గే, శివానంద్‌ పాటిల్‌, యూటీ ఖడార్‌, జమైర్‌ అహ్మద్‌ ఖాన్‌, పుట్టరంగ శెట్టి, శివశంకర రెడ్డి, జయమాల ఉన్నారు.
జేడీఎస్‌ పార్టీ నుంచి మంత్రి పదవులు దక్కిన వారు..
హెచ్‌డీ రేవన్న, జీటీ దేవెగౌడ, బండప్ప కశంపుర్‌, సీఎస్‌ పుట్టరాజు, వెంకటరావ్‌ నాదగౌడ, హెచ్‌కే
కుమారస్వామి, ఎస్‌ఏ ఆర్‌ఏ మహేశ్‌ లు ఉన్నారు. మే 23న కుమార స్వామి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జీ.పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం కర్ణాటకలో మంత్రుల సంఖ్య 34కు మించరాదు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మంత్రి పదవులను 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. దీని ప్రకారం కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి సహా 12 మంత్రి పదవులకు కేటాయించారు. మొదటి దశ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కాంగ్రెస్‌ నుంచి 14 మందికి, జేడీఎస్‌ నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించాయి.