కొల్లాపూర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం

రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.
పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి.
పరిశ్రమలు కేటాయింపుకు స్థల పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్18(జనం సాక్షి):
కొల్లాపూర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు అన్నారు. శనివారం కొల్లాపూర్ పట్టణంలో రూ.170 కోట్లతో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో  మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను పట్టణాలలో పల్లెలలో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.గతంలో తెలంగాణ రాకముందు రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి ఉండేదని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గత ఎనిమిది ఏళ్లలో అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోతున్నదని మంత్రి తెలిపారు.సోమశిల అభివృద్ధి చెందినట్లు అమరగిరి ని కూడా  పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో పెన్షన్లు  రూ. 200 ఉండగా తెలంగాణ వచ్చాక రూ. 2000 చేసిందన్నారు. వికలాంగులకు రూ. 500 ఉన్న పెన్షన్లు రూ. 3016 చేసిందన్నారు ఇంకా చేనేత, గీత కార్మిక పింఛన్లను ఇస్తున్నదని మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలలు విరివిగా ఏర్పాటుచేసి విద్యార్థులకు సన్న బియ్యం అందజేసి నాణ్యమైన భోజనం అందజేస్తుందని మంత్రి తెలిపారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. ఒక లక్ష 116 అందజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ మేనమామ అయ్యాడని మంత్రి తెలిపారు.కొల్లాపూర్ లో డయాలసిస్ సెంటర్, డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయడంవల్ల అనేక మంది పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆహారశుద్ధి పరిశ్రమలు కేటాయించడానికి స్థల పరిశీలన చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.అలాగే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సమాచారం అందజేస్తామని అన్నారు. 98 జీవో ప్రకారం  ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 3400 తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు.  సింగోటం, గోపాల్ దిన్నె రిజర్వాయర్ వల్ల అనేక ప్రాంతాలు మా గాని గా మారుతుందని మంత్రి అన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మామిడిపండ్లకు కొల్లాపూర్ ప్రసిద్ధి కావడంతో ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి  శ్రీనివాస్ డ్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి,  ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి  గువ్వల బాలరాజ్, లక్ష్మారెడ్డి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, , జడ్పీ చైర్మన్ లు లోకనాథ్ రెడ్డి, సరిత,మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్,  ఎంపీపీలు, సింగిల్విండో చైర్మన్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.