కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం
– మొదటి ఫలితాలు మహబూబ్‌నగర్ జిల్లాకే
– ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్
మహబూబ్‌నగర్,జులై 21(జనంసాక్షి):పాలమూరు వాసుల దశాబ్దాల కల నెరవేరింది. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులను సాకారం చేసేలా నీటిని అందించే నాలుగు ప్రాజెక్టులను మంత్రి హరీష్ రావు ప్రారంబించారు. కోయిల్ సాగర్,రామన్ పాడు, బీమా ప్రాజెక్టులు సాకారమయ్యాయి. సిఎం కెసిఆర్ పాలమూరు ఎంపిగా తెలంగాణ తీసుకుని వచ్చారని, అందుకే తొలి ఫలితం పాలమూరుకే దక్కాలని నిర్ణయించి ఇక్కడ ప్రాజెక్టులను రూపొందించారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మన బీళ్లను తడపడానికి పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి తొలి ఫలితాన్ని జిల్లా ప్రజలు అందుకుంటున్నారని చెప్పారు. భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా రామన్‌పాడు కాలువను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆత్మకూరు మండలం నందిమళ్ల దగ్గర బీమా సమాంతర కాలువను తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సమాంతర కాలువ ద్వారా నీటిని హరీష్‌రావు విడుదల చేశారు. పాలమూరు బీడు పొలాలకు నీటిని ఇవ్వడం పూర్వజన్మ సుకృతమని మంత్రి హరీష్రావు అన్నారు. కృష్ణా జలాలపై తొలిహక్కు పాలమూరు జిల్లాకే ఉందని హరీశ్ తెలిపారు. ఖరీఫ్‌లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే ఏడాది నాలుగు ప్రాజెక్టుల ద్వారా 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఉద్యమంలో కలిసిరాని నాయకులు.. అభివృద్ధి చెందుతుంటే దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 3 వేల ఎకరాలకే సాగునీరు ఇచ్చారని మంత్రి హరీశ్ అన్నారు. ప్రాజెక్టులను చూడలేని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కొందరు కోర్టుకు వెళ్లారని అన్నారు. వారికి నీళ్లు వస్తే పుట్టగతులు ఉండవని నిర్ణయించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నందిమళ్లలో భీమా ప్రాజెక్టు సమాంతర కాల్వను మంత్రి ప్రారంభించారు. దీంతో జూరాల జలాశయం నుంచి నీరు రామన్‌పాడు చేరుతుంది. రామన్‌పాడు చేరే నీటిని తిరుమలాపూర్ ఫేజ్-1 నుంచి కొత్తకోటలో ఉన్న ఫేజ్-2కు తరలిస్తారు. లక్ష ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా కాల్వ నిర్మాణం చేపట్టారు. ఈమేరకు ఆత్మకూరు మండలం నందిమలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలువకు మంత్రి హరీష్‌రావు ప్రారంభోత్సవం చేశారు. జూరాల నుంచి నీళ్లు రామన్ పాడుకు చేరుకున్నాయి. భీమా ఎత్తిపోతల ద్వారా లక్షా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ప్రతి చుక్కనీటిని వాడుకుందామని, రైతులకు ఇచ్చే పరిహారం ఏదైనా ఉన్నా దానిని పూర్తిగా చెల్లిస్తామన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు కడుతున్నామని ఇంతకాలం ప్రజలు మభ్య పెట్టారని అన్నారు. అయినా నీళ్లురాలేదన్నారు. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయని అన్నారు. 2600 కోట్లు ఖర్చు పెట్టి నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేశామని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రజల మనిషని, ఆయనకు ఎలాంటి భేదాలు లేవని, ప్రజలకు మేలు జరగాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేశామని అన్నారు. సిఎం సంకల్పం వల్లనే ఇవాళ నీరు తెచ్చుకోగలిగామని అన్నారు.
జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో ఇవాళ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈమేరకు ధరూర్ మండలం రేలంపాడు వద్ద నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో లిఫ్ట్‌కు హరీష్‌రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ లిఫ్టు ద్వారా నెట్టెంపాడు, ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. కృష్ణా నీటిలో మొదటి హక్కుదారులు పాలమూరు బిడ్డలని అన్నారు. తమ రెండేళ్ల పాలనలోనే పాలమూరు జిల్లాలోని నాలుగు లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు మూడు వేల ఎకరాలకే నీరందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో పాలకులపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేయకపోవడం వల్లే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదని విమర్శించారు. ఆంధ్రాలో మాత్రం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కరువు కష్టాలు తొలగనున్నాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. డిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా రెండు జిల్లాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం. తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు సాగునీరు అందించడం అత్యంత అవసరమనన్నారు కేసీఆర్. రాకెట్ వేగంతో పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తిచేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఆ శాఖ మంత్రితో పాటు ఆయా జిల్లాల మంత్రులు చిన్న సమస్య తలెత్తినా రంగంలోకి దిగి పరిష్కరించాలని సీఎం సూచించారు. సాగునీటి విషయంలో ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ ప్రదర్శించాలన్నారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను కోరారు సీఎం.
కెసిఆర్ జగమొండి..అందుకే ప్రాజెక్టులు పూర్తి చేసి చూపారు
పదేళ్ల పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రాజెక్టులకు కిరికిరిలు పెట్టి నీరివ్వకుండా చేసిందని మంత్రి హరీష్రావు అన్నారు. 90శాతం నిధులు ఎత్తేసి, 60శాతం పనులు కూడా చేయకుండా పోయారని అన్నారు కనీసం ఒక్క ఎకరాకుకూడా నీరివ్వని వారు ప్రాజెక్టులకు అడ్డం పడుఉతన్నారని మండిపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్ ఆనాడు వైఎస్ కాళ్ల దగ్గర చేరితే టిడిపి నేతలు చంద్రబాబు వద్ద మోకరిల్లారని అన్నారు. కోర్టుకేసులతో అడ్డుకోవాలని ఒకరు, భూములివ్వొద్దని కొందరు అడ్డుకుని మొడిగా పోయారన్నారు. అయితే వారికి మంచిన జగమొండి కెసిఆర్ అని, అందుకే ప్రాజెక్టుల పూర్తికే నిలబడ్డారని అన్నారు. ఆయన జగమొండి కనుకనే నిలబడి,తలబడి తెలంగాణ తెచ్చి మనకు ఇచ్చారని అన్నారు. పాలమూరుపర్యటనలో భాగంగా ప్రాజెక్టులను ప్రారంభించిన మంత్రి కాంగ్రెస్, టిడిపిలపై తీవ్రస్థాయిలో విరుచకు పడ్డారు. ప్రజలకు ప్రభుత్వం సాగునీరు, తాగునీరు అందించడం ప్రతిపక్షాలకు ఇష్టంలేదని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజలకు నీళ్లందిస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీళ్లు వస్తున్నాయని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ చేస్తోన్న ప్రజోపయోగ పనులను చూసి వారికి మైండ్ దిమ్మ తిరిగిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజల కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని తెలిపారు. కోటి ఎకరాల మాగాణితో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనేది సీఎం సంకల్పమని అన్నారు. గతంలో మేమే ప్రాజెక్టులను చేపట్టామని బీరాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు చేపట్టిన ప్రాజెక్టులనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. నీళ్లు ఇస్తున్నామని మాటలు చెప్పారు కానీ నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేసిందని వివరించారు. ఇవాళ మహబూబ్‌నగర్ చరిత్రను తిరగరాసిన దినమని తెలిపారు. పాలమూరు జిల్లాలో ఈ ఏడాది 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆకలి బాధతో వలసపోయిన పాలమూరు వాసులు తిరిగి రావాలని కోరారు. ఇకపై జిల్లాలో పంటలు పండించుకోవచ్చని తెలిపారు. త్వరలోనే నెట్టెంపాడు నికర జలాల ప్రాజెక్టుగా మారుతుందని వెల్లడించారు. కృష్ణా, తుంగభద్ర రెండు నదుల మధ్య ఉండి కూడా నడిగడ్డ ప్రాంతం ఇన్నాళ్లు తాగునీటికి నోచుకోలేదని ఆవేదనతో తెలిపారు. ప్రపంచలో ఏ ప్రజలకు ఇలాంటి కష్టం రాకూడదన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి లిఫ్ట్-1 పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాలపై మొదటి హక్కు పాలమూరు ప్రజలదేనని పేర్కొన్నారు. వచ్చే ఎండాకాలంలోగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందిస్తామన్నారు. నీళ్ల కోసం ఆడపడుచులు వీధుల్లో కుళాయిల వద్ద నిలుచోవాల్సిన అవసరం ఉండదన్నారు. జూరాల నుంచి నీటిని తరలించి తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫ్లడ్ లైట్టు పెట్టించి అక్రమ కాల్వలు తవ్వి అనంతపురానికి నీల్లు తీసుకెళ్తుంటే ఎమ్మెల్యే డీకే ఆరుణ మంగళహారతులు పట్టారని గుర్తు చేశారు. ధరూర్ మండలం రేలంపాడు వద్ద నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో లిఫ్ట్‌కు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డితోపాటు పలువురు నేతలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ లిఫ్టు ద్వారా నెట్టెంపాడు, ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. రేలంపాడుకు హెలికాప్టర్ లో చేరుకున్న మంత్రులకు స్థానికులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.