కోటి ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం

రైతులను ప్రోత్సహించాలన్న బాబు

అమరావతి,జూన్‌4(జ‌నం సాక్షి): కోటి ఎకరాల్లో పండ్లతోటల సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారంటెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటి చేరిక ఎంత ముఖ్యమో, జలాశయాల నిర్వహణ అంతకన్నా ప్రధానమన్నారు. సీజన్‌లో సాగునీటి విడుదలపై రైతుల్లో భరోసా పెంచాలని అధికారులకు సూచించారు. సాగునీటి విడుదల తేదీలను ముందే ప్రకటించాలన్నారు. పంటకాలువలు, చెరువులు నీటినిల్వకు సంసిద్ధం చేయాలని తెలిపారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేయాలని సిఎం ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులకున్న గేట్లను తనిఖీ చేయాలని, పకడ్బందీగా గేట్ల నిర్వహణ ఉండేలా శ్రద్ధపెట్టాలని అధికారులకు తెలిపారు. భూగర్భాన్ని అతిపెద్ద జలాశయంగా మార్చుకోవాలని సూచించారు. జల సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. మైక్రో ఇరిగేషన్‌ మరో నాలుగు రెట్లు పెరగాలని సిఎం అన్నారు. పరితల నీటి వినియోగంపై అధ్యయనం చేయాలని, క అష్ణా ఆయకట్టుకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సేద్యపు పనులకు రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని, ఏరువాక కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు.

—————