కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు

 వచ్చే నెల నుంచి గ్రామాల్లో కంటి పరీక్షలు
60ఏండ్లు తాగునీటి కోసం బాధపడ్డాం
మిషన్‌ భగీరథతో ఆ బాధలు తీరుతున్నాయి
భారీ నీటిపారదుల శాఖ మంత్రి హరీష్‌ రావు
బొల్లారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి
సంగారెడ్డి, జూన్‌13(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో కోటి మందికి ఉచితగా కంటి పరీక్షలు నిర్వహించి, కోటి మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వచ్చే నెల నుంచి ఈకార్యక్రమాన్ని అమలు చేయటం జరుగుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.  సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో మిషన్‌ భగీరథ రిజర్వాయర్‌తో పాటు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్‌ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ..  60ఏండ్లుగా మంచి నీళ్ల కోసం బాధపడ్డామని నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. జిన్నారం రైతాంగానికి కాళేశ్వరం నీళ్లు అందిస్తాం. దసరాలోగా ఇంటింటికీ మంజీరా నీళ్లు సరఫరా చేస్తామని చెప్పారు. రాబోయే 50ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పైప్‌లైన్లు వేస్తున్నాం. బొల్లారంలో మిషన్‌ భగీరథ కోసం రూ.18కోట్లు మంజూరు చేశాం. 10రోజుల్లో హైరిస్క్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కళ్యాణమండపం కోసం ఎకరం స్థలం, కోటిన్నర కూడా మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్‌ హయంలో పరిశ్రమలకు 3రోజులు పవర్‌ హాలీడే ఇచ్చారని హరీష్‌ రావు గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నదని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లు పేదలకు బతకగలమనే భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తున్నాం. రైతులకు ఎకరానికి రూ.8వేల పంట పెట్టుబడి ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించబోతున్నాం. కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ వినూత్న రీతిలో ప్రజలకు ఉపయోగయేగపడే విధంగా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.