కోఠీలో 2 వేల మంది ఆశావర్కర్ల ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కోఠీలో 2వేల మంది ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వద్ద పెండింగ్‌లో ఉన్న వేతనాలు, కనీస వేతనాలు చెల్లించాలని పలు జిల్లాల నుంచి వచ్చిన ఆశావర్కర్లు డిమాండ్‌ చేస్తున్నారు. తమను పర్మినెంట్‌ చేయాలని, ప్రతి నెలా వేతనం ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై వెంటనే అధికారులు స్పందించాలన్నారు. రోడ్డుపైన ఆశావర్కర్లు ఆందోళన చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆశావర్కర్ల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.