కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆధిపత్యంపై పోరాటం

పావులు కదుపుతున్న అధికార టిఆర్‌ఎస్‌

రంగంలోకి జగదీశ్వర్‌ ,గుత్తాలు?

నల్గొండ,జూలై18(జ‌నం సాక్షి): ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లాలో నేడు అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు పట్టు కోసం పావులు కదుపుతున్నాయి. రెండు పార్టీలు ఆధిపత్య పోరాటం చేస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా ముద్రపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఢీ కొట్టేందుకు తెరాస పావులు కదుపుతోంది. ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఎదగకుండా చేయాలన్న వ్యూహంతో సాగుతున్నారు. రాష్ట్రమంతా అధికార పార్టీ హవా కొనసాగినా ఇక్కడ కాంగ్రెస్‌ మూలాలు బలంగా ఉండటంతో… ఎలాగైనా ఇక్కడ తెరాసను బలోపేతం చేయాలని మంత్రి జగదీష్‌రెడ్డి మూడున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపాలనే ఉద్దేశంతో కోమటిరెడ్డి శ్రేణులను తనదైన శైలిలో ముందుకు తీసుకుని వెళుతున్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం మాటెలా ఉన్నా కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు అన్నరీతిలో సాగుతున్నారు. స్థానిక శాసనసభ్యుడిగా తనకు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఉందని.. దానిని అధికార పార్టీ కాలరాస్తోందని… ప్రభుత్వం, ఆపార్టీ నాయకులు రౌడీయిజంతో నల్గొండ ప్రజల్లో భయబ్రాంతులను సృష్టిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని కోమటిరెడ్డి ఇటీవలి ఘటనల సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో ఒక్కటైన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్‌ ఐదు, తెరాస ఆరు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రమంతా తెరాస హవా కొనసాగినా.. జిల్లాలో మాత్రం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. 2015 డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రాష్ట్రమంతా కారు హవా సాగినా.. ఇక్కడ మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిచి ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. అయితే తెరాస ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా నల్గొండ ఎంపీ గుత్తాతో పాటు కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ సీపీఎం

ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు తెరాసలో చేరడంతో అధికార పార్టీ ఆధిపత్యం చలాయించింది. దీనిని ఎదుర్కొవడానికి ఆరు నెలలుగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ మిర్యాలగూడ, మునుగోడు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేస్తామని పలు వేదికల్లో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తామని పదేపదే వెంకటరెడ్డి ప్రకటిస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్‌ బిజెపిలో చేరుతారని కొంతకాలం నుంచి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ బలంగా ఉన్న పార్టీని దెబ్బకొట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ప్రస్తుతం వినిపిస్తోంది. ఇకపోతే ధికార పార్టీ నుంచి నల్గొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా కొనసాగుతున్న దుబ్బాక నర్సింహ్మారెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చాలా ఏళ్ల నుంచి వైరం ఉంది. వ్యక్తిగత వైరం కాస్తా ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఘర్షణ పూరిత వాతావరణంగా మారింది. రెండు దశాబ్దాల పాటు కోమటిరెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి విషయంలో అడుగులు పడటం లేదని భావిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించాలనే ప్రణాళికలతో ఆయన ముందుకు వెళుతున్నారు. స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడమూ అధికార పార్టీ కార్యకర్తలను ఇంతకుముందెన్నడూ లేని ఉత్సాహం తెచ్చిపెడుతోంది. దీంతో పలు కార్యక్రమాలను ఇరువురు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ మధ్య కాలంలో ఘర్షణల సంఖ్య పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం ఒకరి లక్ష్యమైతే…, రెండు దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయినా పార్టీ బలాన్ని తగ్గించి నల్గొండను తెరాసకు కంచుకోటగా మార్చే లక్ష్యంతో మంత్రి, స్థానిక నేతలు ముందుకువెళుతుండటంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాలి. ఏదీఏమైనా కొన్ని రోజులుగా మాటలకే పరిమితమైన రెండుపార్టీల నాయకులు, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఘర్షణలకు దిగడంతో రాజకీయ వేడి అందుకుంది.