కోర్టుల్లో విచారణ ప్రత్యక్ష ప్రచారానికి.. 

సుప్రిం సముఖత
న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : కోర్టు రూమ్‌లో జరిగే వాదనలను లైవ్‌లో ప్రసారం చేయడానికి చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సుముఖత వ్యక్తం చేశారు. దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ అభిప్రాయాన్ని వినిపించింది. ఈ అంశంపై ప్రభుత్వ వివరణను జూలై 23వ తేదన ఇవ్వాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం కోరింది. సుప్రీంకోర్టులో జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న అంశాన్ని గతంలో అటార్నీ జనరల్‌ సమర్థించారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై జరిగే కోర్టు వాదనలను లైవ్‌ స్ట్రీమ్‌ చేయడానికి సుప్రీం అనుకూలంగానే ఉందని, దానికి కావాల్సిన మార్గదర్శకాలను కేంద్రం సూచించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏఎం ఖాన్‌విల్కర్‌, డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. ఆధార్‌, గే సెక్స్‌ లాంటి అంశాలపై కోర్టు ప్రొసీడింగ్స్‌ను లైవ్‌ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీం తెలిపింది. సీనియర్‌ అడ్వకేట్‌ ఇందిరా జైసింగ్‌ వేసిన పిటీషన్‌ ఆధారంగా కోర్టు ఈ అంశాన్ని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ కోర్టులు కేసులను రికార్డు చేస్తుంటాయని, ఒక్కొక్కరు భిన్నమైన పద్ధతులను అనుసరిస్తుంటారని జైసింగ్‌ తన పిటీషన్‌లో తెలిపారు.