కోలుకుంటున్న బాసర విద్యార్థులు

ఘటనపై కొనసాగుతున్న విచారణ

 

నిర్మల్‌,జూలై16(జనం సాక్షి ): తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. శుక్రవారం ఫుడ్‌ పాయిజన్‌తో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు పడిపోయారు. క్యాంపస్‌ ఆసుపత్రిలో 60 మందికి చికిత్స అందింగా… నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో 17 మంది, నవీపేటలో 12 మందికి చికిత్స అందజేశారు. మరోవైపు ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. సమగ్ర విచారణకు విద్యాశాఖ మంత్రి సబితా ఆదేశించారు. బాధిత విద్యార్థులను ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ పరామర్శించారు. మెస్‌ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ పై అధికారుల విచారణ కొనసాగుతోంది. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది తెలిపారు. 11 మంది విద్యార్థులకు నిజామాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఇ 1, ఇ 2 మెస్‌ లో ª`రెడ్‌ రైస్‌ తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇదిలాఉంటే ఫుడ్‌ పాయిజన్‌ విషయం బయటకు రాకుండా అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాసర ట్రిపుల్‌ ఐటీ ఫుడ్‌ కాంట్రాక్టర్‌ ను మార్చాలని విద్యార్థులు కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆహారం నాసిరకంగా ఉంటోందంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.