‘కోల్‌సిటి’లో సంచలనం’
– వాటర్ ట్యాంక్ ఎక్కి… గర్భిణి ఆత్మహత్యాయత్నం – తోడుగా మరో యువతి
– తరలివచ్చిన జన సందోహం – పోలీసుల ‘లాఠీ’ ప్రతాపం
– నాలుగు గంటలు ఉత్కంఠ
గోదావరిఖని, మే 27, (జనం సాక్షి) :
గోదావరిఖని కార్మిక నగరంలో ఆదివారం సంచలనం జరిగింది. సినిమా ‘సీన్’ ప్రత్యక్షమైంది. ప్రేమించిన ప్రియునితో… వివా హం జరిపించాలని హైదరాబాద్‌కు చెందిన ఓ గర్భిణి మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఈమెతో పాటు ఆమె ప్రాణస్నేహితురాలు మరొ కరు కూడా… ట్యాంక్ ఎక్కింది. వీరిద్దరు తమ డిమాండ్‌కు అనుకూలంగా న్యాయం చేయాలని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిద్దరు గత 3నెలల క్రితం హైదరాబాద్‌లో ఇదే తరహాలో ఆత్మహత్యాయత్నం చేశారు. పారిశ్రామిక ప్రాంత నలువైపుల నుంచి ఈ సంఘటనను చూడటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పలుమార్లు పోలీసులు జనంపై లాఠీ ప్రతాపం చూపారు. దీంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు గంటల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా సూర్యపేటకు చెందిన హైదరాబాద్‌లోని బిఎన్‌ఆర్ రెడ్డి కాలనీలో బ్యూటీపార్లర్ నిర్వహించే రేష్మతో ఎంసీఏ చదువుతున్న స్థానిక ఐబికాలనీకి చెందిన వేముల కుమారస్వామితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. వీరిద్దరు మానసికంగానే కాకుండా శారీరకంగా దగ్గరయ్యారు. రేష్మ గర్భం దాల్చ డంతో… తనను వివాహం చేసుకోవాలని కుమారస్వామిపై ఒత్తిడి తెచ్చింది. కుమారస్వామి ముఖం చాటేశాడు. దీంతో రేష్మ తన ప్రాణ స్నేహితురాలు అనూషతో కలిసి… కుమారస్వామి నివాసం ఉండే హైదరాబాద్ ఉప్పల్‌లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అక్కడి పోలీసులు… కుమారస్వామిపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి వారిద్దరిని కిందికి దించారు. చెప్పినట్లుగానే కుమారస్వామిపై కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. ఇంతటితో ఈ వివాదం ఆగిపోలేదు. గోదావరిఖనికి చేరింది. రేష్మ, అనూష ఇటీవల స్థానిక పోలీసులకు కుమారస్వామిపై ఫిర్యాదు చేశారు. కుమారస్వామి దొరకకపోవడంతో… రేష్మ ఫిర్యాదు మేరకు అతని కుటుంబ సభ్యులను విచారించారు. కాగా, ఆదివారం తెల్లవారు జామున స్థానిక అశోక్‌నగర్‌లోని మున్సిపల్ వాటర్‌ట్యాంక్ ఎక్కి, ఆత్మహత్య చేసుకోవడానికి రేష్మ, అనూష పథకం వేసుకున్నారు. ఈ విషయాన్ని కొన్ని టీవి చానళ్లకు సమాచారం అందించారు. ట్యాంక్ ఎక్కిన వీరిద్దరు పలుమార్లు కిందికి దూకడానికి ప్రయత్నించారు. సెల్‌ఫోన్‌లో స్థానిక పోలీసులు, మహిళా సంఘాలు వారిద్దరిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికి… కిందికి దూకుతామని… లేనట్లయితే కుమారస్వామితో తనకు వివాహం జరిపించాలని రేష్మ, ఆమె స్నేహితురాలు అనూష మొండికేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి నగరం నలుమూలల నుంచి వందలాది మంది జనం ఘటన స్థలానికి చేరుకున్నారు. వీరిని చెదరగొట్టడానికి పోలీసులు పలుమార్లు లాఠీచార్జీ నిర్వహించారు. చివరకు… రేష్మ, అనూషలకు గోదావరిఖనిలో పరిచయమైన స్థానిక పవర్‌హౌస్‌కాలనీకి చెందిన శ్యామ్ ట్యాంక్‌పైకి వెళ్లి వారిద్దరిని సముదాయించి… కిందికి తీసుకవచ్చాడు. అయితే తమపై పోలీసులు కేసు పెట్టనని హామీ ఇస్తేనే… కిందికి దిగుతామని డిమాండ్ పెట్టారు. పోలీసులు హామీ ఇవ్వడంతో శ్యామ్ వెంట కిందికి దిగారు. దీంతో నాలుగు గంటల పాటు ఉత్కంఠగా సాగిన ఈ సంఘటన సుఖాంతమైంది. అయితే… ఈ సంఘటనతో కుమారస్వామి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి… అదృశ్యమయ్యారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేరంపై రేష్మ, అనూషలపై ఐపీసీి 309 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు వన్‌టౌన్ సీిఐ ఎడ్ల మహేష్ తెలిపారు.