కోహ్లి అవుటే కీలకం!

కోహ్లి అవుటే కీలకం!

డేవిడ్ వార్నర్ నాయకత్వం ముందు విరాట్ కోహ్లి దూకుడు పనిచేయలేదని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఆవేశం ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యమని ఉద్భోదించారు. ఎప్పటిలానే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. హైదరాబాద్ ను అభినందనలతో ముంచెత్తారు. ఆర్సీబీని ఊరడిస్తూనే చురకలు అంటించారు. మ్యాచ్ పై తమ అభిప్రాయాలను, వ్యాఖ్యలను నెటిజన్లు నిష్కర్షగా ప్రకటించారు. మొత్తంగా మ్యాచ్ మంచి వినోదాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు.

విరాట్ కోహ్లి అవుట్ కావడమే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అని ఒకరు వ్యాఖ్యానించారు. అతడు అవుటైన ఫొటో పెట్టి ‘ఇక్కడే హైదరాబాద్ గెలిచింది’ అని కామెంట్ పెట్టారు. డివిలియర్స్ త్వరగా పెవిలియన్ చేరడం ఆర్సీబీ కొంప ముంచిందని మరొకరు పేర్కొన్నారు. మ్యాచ్ ఫలితంలో వైడ్లు కీలకపాత్ర పోషించాయని ఇంకొరు వెల్లడించారు. ఆర్సీబీ బౌలర్లు 11 వైడ్లు వేస్తే, హైదరాబాద్ బౌలర్లు 4 వైడ్లు మాత్రమే వేశారని తెలిపారు. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ కింగ్‌ షిఫర్ ఎయిర్ లైన్స్ లా కూలిందన్నారు. తమ జట్టు గెలవకపోవడంతో గుండెబద్దలైనంత పనైందని ఆర్సీబీ వీరాభిమానులు బాధ పడ్డారు.