కౌలు రైతులకు అండగా నిలవాలి


వారికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలి
ఏలూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : అధికారంలోకి వస్తే కౌలురైతులకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పిన విధంగా వైఎస్‌ జగన్‌ తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సాగు భారమై రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా జిల్లా రైతాంగాన్ని పట్టించుకునే నాధుడే లేకపోయాడు. జిల్లాలో రెండున్నర లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ సాగులో 70 శాతం వీరే చేస్తున్నారు. అయితే బ్యాంకులు మాత్రం అసలు సాగుదారుడైన కౌలురైతులకు కాకుండా పట్టణాల్లో వ్యాపారాలు చేసుకునే భూయజమానులకు రుణాలిస్తున్నాయి. దీంతో వాస్తవ సాగుదారుడైన కౌలురైతు అప్పుల ఊబిలో చిక్కుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. ఏటేటా కౌలు రైతు పరిస్థితి దారుణంగా తయారవుతోంది. బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో పెట్టుబడుల కోసం అన్నదాత వడ్డీ బకాసురుల ఉచ్చులో చిక్కుకుంటున్నాడు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిరది. గతంలోనూ ఇదేవిధంగా వడ్డీవ్యాపారుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం 2011లో కౌలురైతులకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. భూయజమానితో సంబంధం లేకుండా గ్రామసభలు నిర్వహించి ఎల్‌ఇసి కార్డులు
అందజేసి వాటి ఆధారంగా రుణాలిచ్చే విధంగా చట్టంలో పొందుపరిచారు. అయితే అవి నేటికీ సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వానికి కౌలురైతులపై కనికరం లేకుండా పోయిందనడానికి ఎల్‌ఇసి కార్డులిచ్చి చేతులు దులుపుకుంది. రైతుమిత్ర, ఎల్‌ఇసి కార్డుల ద్వారా కౌలురైతులకు ఇచ్చిన రుణం జిల్లా వ్యవసాయ రుణప్రణాళికలో ఒకటిన్నర శాతం మాత్రమే అని తెలుస్తోంది. బ్యాంకులు ముఖం చాటేయడం తో గత్యంతరం లేని పరిస్థితుల్లో కౌలురైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పెట్టుబడి తడిసి మోపెడవుతున్నా.. ప్రభుత్వం నుంచి కనీసం సాయం అందకుండా పోయింది. కౌలురైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. దీంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా కౌలురైతులకు రుణాలందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ముందుముందు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం కన్పిస్తోంది.