క్యాంపు రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధం
– ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
– ఆరు చొట్ల ఎన్నికలు
– 27న పోలింగ్
– భన్వర్‌లాల్
హైదరాబాద్,డిసెంబర్12(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధమని, అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి శనివారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యిందని, దీంతో ఆరు స్థానాల్లో ఒక్కొక్కరే రంగంలో నిలవగా వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. ఈ ఆరు స్థానాలు అధికార టిఆర్‌ఎస్ ఖాతాలోకి వచ్చేశాయని, శనివారం కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలనుటిఆర్‌ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. పోటీ నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
మిగిలిన నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఈ నెల 27న పోలింగ్ జరుపుతామని భన్వర్‌లాల్ తెలిపారు. కాగా ఆదిలాబాద్, వరంగల్, మెదక్‌లోని ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎన్నికవగా తాజాగా కరీంనగర్ రెండు, నిజామాబాద్ ఒక స్థానంలో కూడా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులు ప్రకటన చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మిగిలిన ఆరు స్థానాలకు మాత్రమే ఎన్నిక జరుపుతారు. రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ నెల 27న పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 30న స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. క్యాంపు రాజకీయాలపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మెదక్ జిల్లా నంచి పోటీ చేస్తోన్న ఆ పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈమేరకు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రం అందజేశారు. ఇదిలావుంటే సంఖ్యాబలం ఉంది కాబట్టే టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఏకగ్రీవాలపై ఆయన స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ హావిూ మేరకు టికెట్ ఇచ్చి గెలిపించారు. 12 ఎమ్మెల్సీ స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కావడం మామూలు విషయం కాదు. సంఖ్యాబలం ఉంది కాబట్టే ఏకగ్రీవం అయ్యాం. ఇది ప్రజా విజయం. ఈ విజయాలతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. పదవులు రాగానే పొంగిపోయేవాళ్లం కాదని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణకు కరీంనగర్ జిల్లా మొదటి నుంచీ కేంద్ర బిందువుగా ఉంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది. పదవులు రాగానే పొంగిపోయేవాళ్లం తాముకాదని ఆయన పేర్కొన్నారు. తాము ప్రజలకు జవాబుదారులుగా పనిచేస్తామే కానీ ప్రతిపక్షాలకు కాదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌కు వెళ్లిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడంపై పలువురు అఖిలపక్ష నాయకులు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. కానీ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ
పథకాలకు ఆకర్షితులై అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన వరంగల్ ఎన్నికలన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తాము పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున అభివృద్ధికి కొంత ఆటంకం కలుగుతోందని చెప్పారు.