క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు

మరో ముగ్గురికి ఇడి నోటీసులు
బ్యాంకు లావాదేవీలపై అధికారుల ఆరా

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ నోటీసులు జారీచేసింది. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులైన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డికి ఇప్పటికే తాఖీదులు ఇచ్చింది. తాజాగా విమానాల ఆపరేటర్‌ సంపత్‌తోపాటు మరో ఇద్దరు ఏజెంట్లకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఏజెంట్లు చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇండ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ.. దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారిద్దరి బ్యాంకు ఖాతాల్లో రూ.25 కోట్ల లావాదేవీలను గుర్తించింది. వారి ఖాతాల నుంచి రాజకీయ నాయకులు, అధికారులకు నగదు బదీలీలు జరిగినట్లు తేలింది. దీంతో ఆయా లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు ఆరాతీస్తున్నారు. ఏడాది వ్యవధిలో గోవా, శ్రీలంక, నేపాల్‌, థాయిలాండ్‌లో నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్లు గుర్తించారు. అదేవిధంగా హవాలా మార్గంలో డబ్బులు తీసుకెళ్లి మళ్లీ తీసుకొచ్చారని, దీనికోసం బేగంబజార్‌, జూబ్లీహిల్స్‌కు చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల సహాయం తీసుకున్నట్లు తేలింది. కాగా, ఫెమా నిబంధనల ఉల్లంఘనలో పూర్తి ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు.

తాజావార్తలు