‘క్రిష్ణా’ ఇవేం టెస్టులు?!`

తప్పుడు రిపోర్టుతో పేషేంట్‌ ను బెంబేలెత్తించిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌

` సిటి సీవియారిటి 13`14 బదులుగా 20`21 గా నమోదు

` టెస్ట్‌ రిపోర్ట్‌ చూసి స్పృహ కోల్పోయిన పేషేంట్‌

` కరీంనగర్‌ లో పేరుమోసిన ‘క్రిష్ణా’ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నిర్వాకం

కరీంనగర్‌, జులై 29 (జనంసాక్షి) : కాసుల కక్కుర్తితో రోగనిర్ధారణ కేంద్రాలు (డయాగ్నస్టిక్‌ సెంటర్లు) రోగులను దోచుకుంటూ డాక్టర్లకు వాటాలు ఇస్తున్నాయనే వార్తలు మనకు నిత్యకృత్యం. పేదరోగులను దోచుకోవడానికి రోగులను భయభ్రాంతులకు గురిచేసి వాటి పబ్బం గడుపుకుంటున్న తీరు జుగుప్సాకరం, అమానవీయం, అనైతికం. రోగుల ఆత్రుత, అవగాహనాలేమి ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లకు కాసులు కురిపిస్తుంది. ఇలాంటి వార్తలకు బలం చేకూర్చేలా ఉంది కరీంనగర్‌ నగరంలోని క్రిష్ణా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ లో శనివారం నాడు జరిగిన సంఘటన. కోవిడ్‌ భారినపడి కోలుకుంటున్న చొప్పదండికి చెందిన దుర్గాప్రసాద్‌ (39) అనే యువకుడి అనుభవం తన మాటల్లోనే… ‘‘నా పేరు దుర్గాప్రసాద్‌. నేను చొప్పదండిలో ఉంటా. నాకు కోవిడ్‌ సోకినప్పటి నుండి మాకు తెలిసిన డాక్టర్‌ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్‌ తీసుకుంటున్న. డాక్టర్‌ చెప్పిన మందులు వాడుతున్న. ఇబ్బంది లేకుంటే పది రోజుల వరకు రానవసరం లేదని డాక్టర్‌ చెప్పిండు, కానీ నేనే ఐదు రోజులకోసారి వచ్చి చూయించుకుంటున్న. అలాగే శనివారం కూడా మా బావ ఆటోలో నేను, నా భార్య డాక్టర్‌ దగ్గరికి పోయినం. డాక్టర్‌ నన్ను పరీక్షించి ఏం పర్లేదు, నీకు తగ్గిపోతుంది, ఎలాంటి పరీక్షలు కూడా అవసరం లేదు అని చెప్పిండు. సిటి స్కాన్‌ గిట్ల తీయించుకోమంటరా అని అడిగితే అది కూడా అవసరం లేదు, నేనెవరికీ సిటి స్కాన్‌ రిఫర్‌ చేయను అన్నడు. ఒకవేళ సిటి స్కాన్‌ చేస్తే నీకు వచ్చిపోతున్న స్టేజిలో కరోనా ఉంది కాబట్టి కొంత ఇన్ఫెక్షన్‌ కనిపించే అవకాశం ఉంది. నీకు దగ్గు, జ్వరము, సర్ది లాంటివి ఏవిూ లేవు కాబట్టి స్కానింగ్‌ అవసరం లేదు అన్నడు. కానీ నేనే అప్పుడప్పుడు చెస్ట్‌ కొంచెం నొప్పి అనిపిస్తుంది, నిమోనియా లాంటిదేమోనని అని అనుమానం అనేసరికి సార్‌ రాసిండు. డాక్టర్‌ దగ్గరి నుంచి క్రిష్ణా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ కు పోయినం. అక్కడ చెస్ట్‌ స్కానింగ్‌, సిఆర్‌ పి టెస్టులు చేసిండ్రు. కొద్దిసేపటికి సిటి స్కానింగ్‌ రిపోర్ట్‌ చేతిలో పెట్టి సిటి సీవియారిటి 20`21 ఉంది. పరిస్థితి సీరియస్‌, ఇక్కడ ఇంకో సార్‌ వస్తడు, ఇక్కడే కూర్చో అని అక్కడి స్టాఫ్‌ అనేసరికి నాకు ఒక్కసారే పాణం పొయినట్లైంది. చల్లచెమటలు పెట్టినయ్‌, వణుకుడు మొదలైంది. వెంటనే హైదరాబాద్‌ లో ఉండే తెలిసిన సారుకు ఫోన్‌ చేసి నా పరిస్థితి చెప్పిన, ఇదే నా ఆఖరి ఫోన్‌ కాల్‌ కావొచ్చు సార్‌ అని ఏడ్చిన. ‘నీ పరిస్థితి చూస్తే అలా లేదు, రిపోర్టులో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, నీకు ఏం కాదు, అవసరమైతే నిన్ను అంబులెన్సులో హైదరాబాద్‌ కు తెప్పించి చికిత్స ఇప్పిస్తా, ముందైతే డాక్టర్‌ దగ్గరికి వెళ్లి రిపోర్ట్‌ చూయించు’ అని ధైర్యం చెప్పిండు. వెంటనే ల్యాబ్‌ వాళ్ళను సిఆర్‌ పి టెస్టు రిపోర్ట్‌ కూడా యివ్వుమని అడిగిన. వాళ్ళు ఇవ్వం అన్నరు. మధ్యాహ్నం రెండు గంటలకు డాక్టర్‌ వస్తడు, ఏం చేయాలనేది సార్‌ చెప్తడు, సార్‌ వచ్చాకే రిపోర్ట్‌ ఇస్తం అన్నరు. నా పరిస్థితి చూసి మా బావ ముందైతే మన డాక్టర్‌ దగ్గరికి పోదాం పద అని నన్ను ఆటోలో కూసుండబెట్టుకొని పోయిండు. ఇగ నాకైతే ఆటోలో కూసున్నదే గుర్తుంది, ఆటో ఎట్ల పోయింది ఏమైంది అనేది ఏం సోయి లేదు. మళ్ళీ డాక్టర్‌ దగ్గరే కండ్లు తెరిచిన, జరిగింది చెప్పినం. వెంటనే డాక్టర్‌ సార్‌ ల్యాబ్‌ వాళ్లకు ఫోన్‌ చేసి కోపానికి వచ్చిండు. ‘రిపోర్టులు విూ దగ్గర ఉంచుకొని పేషేంటును ఎందుకు భయపెట్టిండ్రు, కోవిడ్‌ లక్షణాలే లేని పేషేంట్‌ కు సీవియారిటి 20`21 ఎలా ఉంటది? ఏదో పొరపాటు జరిగిఉంటుంది. రిపోర్టులు ఇవ్వండి’ అని ల్యాబ్‌ వాళ్లకు చెప్పిండు. వెంటనే మా బావ ల్యాబ్‌ కు పోయి రెండు రిపోర్టులు తెచ్చిండు. వాళ్ళు మళ్ళీ ఇచ్చిందాంట్లో సీవియారిటి 13`14 అని ఉంది. అది చూడంగనే మళ్ళీ పాణం వచ్చినట్లైంది. ‘చెప్పినా చూడు సిటి స్కాన్‌ అవసరం లేదని.. ఇప్పటికైనా ఏం భయపడకు, ఇంటికిపోయి మంచిగ తినుకుంటూ రెస్ట్‌ తీసుకో’ అని మా డాక్టర్‌ సార్‌ చెప్పిండు. ఫస్ట్‌ రిపోర్ట్‌ చూసినప్పటి నుండి అప్పటిదాకా దాదాపు ఓ మూడు గంటలు నేనెక్కడున్ననో సోయిలేదు. ఫస్ట్‌ రిపోర్ట్‌ చూసిన భయంలో నాకు ఏమైనా అయితే మా ఇంటోళ్ల పరిస్థితి ఎట్లుంటుండే? తలుచుకుంటేనే భయమైతుంది’’బయటపడకుండానే ఈ భయానక అనుభవం దినాం ఎంతమంది ఎదుర్కొంటున్నారో? మనిషి ప్రాణాల విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం, కాసుల కక్కుర్తి ఉండకూడదని  ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల యాజమాన్యాలు తెలుసుకొని మానవత్వంతో ప్రవర్తించాలి. లేదా ప్రభుత్వమైనా ఆ దిశగా కఠినచర్యలు తీసుకోవాలి.