క్షమాపణలు చెప్పండి

5
– మా కార్యాలయంపై దాడులు దారుణం

న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జనంసాక్షి):

ఢిల్లీ సచివాలయంలో సీబిఐ దాడులు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. తమ కార్యలయంపై దాడులు చేయడం దారుణమని, ఈ ఘటనపై క్షమాపణలు చేప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీబీఐ దాడులు ఆశ్చర్యాన్ని కలిగించాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని సీబీఐ టార్గెట్‌ చేసిందని ఆయన ఆరోపించారు. అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, అవినీతిలో ప్రమేయం ఉంటే తన కొడుకునైనా జైలుకు పంపిస్తానని కేజ్రీవాల్‌ అన్నారు.  వాళ్లకు తానే టార్గెట్‌ అని, తన కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ కాదని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి సంబంధం ఉన్న డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌) ఫైళ్ల కోసమే సోదాలు నిర్వహించారని ఆయన విమర్శించారు. తన కార్యాలయంలోని ప్రతి ఫైల్‌ను సీబీఐ సోదాలు చేసిందని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటానని ఆయన

అన్నారు.కాగా సీబీఐ దాడులపై  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా మాట్లాడుతూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ను టార్గెట్‌ చేసే దాడులు జరిపారన్నారు. దీనిపై ప్రధాని మోదీతో బహిరంగ

చర్చకు సిద్థమేనని ఆయన  సవాల్‌ విసిరారు. మరోవైపు కేజ్రీవాల్‌ కార్యాలయంలో సీబీఐ దాడులు జరపటాన్ని పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌ తప్పుబట్టారు. అలాగే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నప్పుడు సీఎం కార్యదర్శి సహా ఎవరిపైన అయినా సీబీఐ దాడులు చేయొచ్చని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు.

పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అబద్ధాలు చెప్పారు

పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా అబద్ధాలు ఆడారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆరోపించారు. రాజ్యసభలో అబద్దాలు చెప్పారని అన్నారు. తన సొంత కార్యాలయంలో ఫైళ్లను చూస్తున్నారని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించేందుకే ఇలా చేస్తున్నారని ట్వీట్‌ చేశారు. రాజేంద్ర కుమార్‌ అన్నది కేవలం ఒక సాకు మాత్రమేనన్నారు. ఇక సీఎం కార్యాలయాన్ని సీజ్‌ చేయడంపై తాను షాక్‌ తిన్నానని, ఇలాంటిది ఇంతకు ముందెప్పుడూ లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అరవింద్‌ కేజీవ్రాల్‌కు మద్దతుగా ట్వీట్‌ చేయగా, దానికి సమాధానం ఇస్తూ.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీలా ఉందని కేజ్రీ అన్నారు. ఒకవేళ రాజేంద్రకుమార్‌ తన కార్యదర్శి కాకపోతే ఈ దాడులు జరిగేవా అని ప్రశ్నించి.. జరిగేవి కాదని తానే సమాధానం ఇచ్చారు. అప్పుడు టార్గెట్‌ ఎవరు.. రాజేందరా తానా అని మరో ప్రశ్న సంధించారు. 2002 సంవత్సరంలో షీలా దీక్షిత్‌ అవినీతి వ్యవహారం జరిగితే 2015లో కేజీవ్రాల్‌ విూద సీబీఐ దాడులు జరిగాయని.. ‘వహ్‌.. మోదీజీ’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ వ్యవహారం అటు రాజ్యసభను కుదిపి వేయగా దీనిని కేంద్రం ఖండించింది.