క్షేమంగా విడుదలైన బందీలు

4
– చర్ల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన మావోయిస్టులు

ఖమ్మం,నవంబర్‌21(జనంసాక్షి): గత నాలుగు రోజులుగా మావోయిస్టులు చెరలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.నాలుగు రోజులుగా ఉత్కంఠగా కొనసాగుతున్న ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల మావోయిస్టుల కిడ్నాప్‌ వ్యవహారం అత్యంత సులువుగా పరిష్కారం అయింది. శనివారం ఉదయం ఆరుగురు టీఆర్‌ఎస్‌ నేతలను వదిలేయడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. భద్రాచలం టీఆర్‌ఎస్‌ ఇంచార్జి రామకృష్ణ, పటేల్‌ వెంకటేశ్వర్లు,  పంతమూరు సురేశ్‌, రెప్పకట్ల జనార్దన్‌, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోయిస్టులు వదిలేశారు. బంగారు తెలంగాణా అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం నేడు నెత్తుటి తెలంగాణా చేశారని, మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అన్న కేసీఆర్‌ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారని, పోలీస్‌ రాజ్యం నడుస్తోందని మావోయిస్టులు మండిపడ్డిరు. ప్రభుత్వానికి కనువిప్పు చేయడానికే నేతలను కిడ్నాప్‌ చేసినట్లు మావోయిస్టులు తెలిపారు. బూటకపు ఎన్‌కౌంటర్లు నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. మావోలపై భౌతిక దాడులకు పాల్పడితే మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు టీఆర్‌ఎస్‌ నేతలను హతమారుస్తామని హెచ్చరించినట్లు కిడ్నాప్‌కు గురైన నేతలు విూడియాకు తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతల కిడ్నాప్‌ సమయంలో మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌పేరిట లేఖను కూడా విడుదల చేశారు. తెలంగాణా ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వ విధనాలను నిరసిస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదిఏమైనా టీఆర్‌ఎస్‌ నేతలను సురక్షితంగా వదిలేయడంతో ఉత్తర తెలంగాణా జిల్లాల్లో పోలీసులు కూంబింగ్‌ మరింత తీవ్ర తరం చేశారు.