ఖరీదైన వస్తవులు తీసుకెళ్లారు!

 ప్రభుత్వ బంగ్లా నుంచి ఏసీలను పట్టుకెళ్లిన మాజీ సీఎం
ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ ఎస్టేట్‌ డిపార్ట్‌ మెంట్‌
లక్నో, జూన్‌9(జనం సాక్షి ) : సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో 4ా విక్రమాదిత్య మార్గ్‌లో ఉన్న బంగ్లాకు సంబంధించిన తాళాలను అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఏపీఐ అన్సల్‌ సిటీలోని ఓ ప్రైవేట్‌ విల్లాకు మారారు. అఖిలేష్‌ యాదవ్‌ వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ఎస్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఉదయం బంగ్లాను సందర్శించిన అధికారులు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు. టీవీ ఛానెల్స్‌, విూడియా సిబ్బంది సందర్శన కోసం శనివారం ఉదయం బంగ్లా గేట్లను ఓపెన్‌ చేసి అనుమతించారు. ప్రభుత్వాధికారులు వెళ్లి చూసే సరికి ఆ బంగ్లాలో ఉన్న ఖరీదైన వస్తువులు, సామాగ్రిని అఖిలేష్‌ యాదవ్‌ కుటుంబం తీసుకెళ్లడాన్ని అధికారులు తప్పుపట్టారు. ప్రజాధనాన్ని లూటీ చేశారని మండిపడుతున్నారు. పరిసరాలను చూసి అవాక్కైన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. స్విమ్మింగ్‌పూల్‌ కోసం టర్కిష్‌ నుంచి దిగుమతి చేసుకున్న టైల్స్‌, ఫ్లోర్స్‌ కోసం కొనుగోలు చేసిన ఖరీదైన ఇటాలియన్‌ మార్బుల్స్‌ను తవ్వి పట్టుకెళ్లారు. ఏసీలు, దిగుమతి చేసుకున్న సీలింగ్‌, గార్డెన్‌ లైట్లు, అద్దాలు, బాత్‌రూమ్‌ ఫిట్టింగ్స్‌, తదితర సామాగ్రి బంగ్లా నుంచి మాయమయ్యాయని తెలిపారు. మరీ ముఖ్యంగా జిమ్‌లో ఉన్న పరికరాలు మొత్తం ఖాళీ చేశారని వివరించారు. అంతటితో ఆగకుండా విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన అరుదైన మొక్కలను కూడా వారితో పాటే తీసుకెళ్లారని చెప్పారు. అఖిలేష్‌ యాదవ్‌తో పాటు తన కుటుంబసభ్యులకు అనుగుణంగా 2016లో రూ.46కోట్లు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దారు. మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదని, వెంటనే ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం వారు ఖాళీ చేశారు.