ఖాళీ స్థలాలకూ పన్ని విధింపు
విశాఖపట్టణం,ఫిబ్రవరి14(జనంసాక్షి): పట్టణంలో ఉన్న అన్ని ఇళ్లను పన్ను పరిధిలోకి తీసుకురావాలని పురపాలక శాఖ అధికారులునిర్ణయించారు. అలాగే ఖాళీ స్థలాలను గుర్తించి పన్నులేయాలని చెప్పారు. పురపాలక సంఘాల ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. ఆస్తిపన్నుకు ఆధార్ అనుసంధానం వెంటనే పూర్తిచేయాలని సూచించారు. పన్ను బకాయిలను ఈ నెలాఖరుకల్లా వసూలు చేయడానికి చర్యలు చేపట్టాలని సూచించామన్నారు.అలాగే వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అత్యవసర పనులకు సాధారణ నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. వేసవి కార్యాచరణకు ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఆ మొత్తాన్ని సాధారణ నిధుల్లో జమ చేసుకోవచ్చని చెప్పారు. సకాలంలో పన్ను చెల్లించనివారి కొళాయిలను కత్తిరించాలని ఆదేశించారు. స్వచ్ఛభారత్, ఆకర్షణీయ స్మార్ట్ వార్డుల కార్యక్రమం అన్ని వార్డుల్లో ఒకేసారి జరగాల్సి ఉందన్నారు. త్వరలోనే మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులొస్తాయన్నారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ. 15 వేలు ఇస్తారని వివరించారు. ఎవరెవరికి మరుగుదొడ్లు అవసరమో సర్వే చేస్తున్నామని తెలిపారు. ఇదిలావుంటే జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఎనిమిది ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసారు.ప్రస్తుతం జిల్లాలో 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా వీటిలో 35 ఆసుపత్రుల్లో కాన్పులు చేస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ జొన్నలగడ్డ సరోజని తెలిపారు. జిల్లాలో మొత్తం 600 ఆసుపత్రులున్నాయని, ఇందులో 400 ఆసుపత్రుల్లో తనిఖీలు పూర్తి చేశామన్నారు. మిగిలిన వాటిలో తనిఖీలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 8 ఆసుపత్రులకు అనమతి లేనట్లు గుర్తించి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. నక్కపల్లి 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు ఎలమంచిలి ఆసుపత్రిని వంద పకడల స్థాయికి పెంపునకు ఇప్పటికే ప్రతిపాదించారన్నారు.