ఖుష్‌ ఖబర్‌..


` లాభాల్లో టీఎస్‌ఆర్టీసీ
` రోజుకు రూ.9 కోట్ల ఆదాయం
హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి): లాక్‌డౌన్‌ తర్వాత తెలంగాణ ఆర్టీసీ క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.9 కోట్ల చొప్పున ఆదాయం సమకూరుతోందని, మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల ఆదాయం పెంచుకోగలిగితే సంస్థ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో రవాణాశాఖ ముఖ్య అధికారులతో టీఎస్‌ ఆర్టీసీ ఆర్థికాంశాలపై సవిూక్ష నిర్వహించారు. సంస్థకు వస్తోన్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సంస్థకు రూ.1500 కోట్లు, అదనంగా మరో రూ.1500 కోట్లు బడ్జెటేతర నిధులను కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని ప్రభుత్వ సంస్థకు నెలనెలా సమకూర్చుతున్నామని తెలిపారు. బడ్జెటేతర నిధుల కింద తొలి విడతగా ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1000 కోట్లు బ్యాంకు రుణంగా మంజూరు చేశామని, ఇందులో రూ.500 కోట్లు వచ్చాయని, మరో రూ.500 కోట్లు త్వరలో వస్తాయన్నారు. ఈ నిధుల్ని సంస్థ అవసరాల కోసం ఎలా వినియోగించాలనే విషయంపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సంస్థ ఆర్థికావసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులను కేటాయించడంతో పాటు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం కూడా వినియోగించనున్నట్లు వెల్లడిరచారు. ఇవే కాకుండా ఎన్‌సీడీసీ బ్యాంకు ద్వారా ప్రభుత్వ పూచీకత్తుతో మరో రూ.500 కోట్లు రుణం తీసుకుని సీసీఎస్‌ బకాయిలు చెల్లించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడిరచారు. సంస్థ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఉద్యోగులు, అధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు