గందరగోళంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

మెసేజ్‌లు రాక విద్యార్థుల ఆందోళన
విశాఖపట్టణం,మే29(జ‌నం సాక్షి ): ఆంధ్రా యూనివర్సిటీ ఆన్‌లైన్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఎంసెట్‌ సహాయకేంద్రం వద్ద మంగళవారం తీవ్ర గందరగోళం నెలకొంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఛార్జీలు చెల్లించినప్పటికీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లకు సంబంధించిన సంక్షిప్త సమాచారం సెల్‌ఫోన్లకు  రాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సంక్షిప్త సమాచారం వస్తేనే వెబ్‌ ఆప్షన్‌లు ఇచ్చే అవకాశం ఉండడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు మంగళవారం ఉదయం నుంచి సహాయ కేంద్రానికి పోటెత్తారు. దీంతో కేంద్రం వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వెబ్‌ఆప్షన్‌ ఇచ్చేందుకు ఒక్కరోజే గడువు వుండడం, ఆన్‌లైన్‌లో సమస్య నెలకొనడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉదయం నుంచి వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహాయకేంద్రం వద్ద పడిగాపులు పడ్డారు. రద్దీ కారణంగా కొద్దిసేపు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిలిచిపోయింది. సాంకేతిక సమస్య పరిష్కారం అయ్యే వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహకరించాలని కేంద్రం ఇంఛార్జి ఆచార్య కె.నాగేశ్వరరావు కోరారు.