గజేంద్ర ఆత్మహత్యపై దద్దరిల్లిన లోక్‌సభ

4

-రైతుల ఆత్మహత్యలపై సర్కారును నిలదీసిన విపక్షాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):

ఆప్‌ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రైతు ఆత్మహత్యపై చర్చించాల్సిదేనంటూ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు సభలో పట్టుబట్టారు. సమస్య తీవ్రమైనందున ప్రశ్నోత్తరాలు రద్దుచేసి రైతు ఆత్మహత్యపై చర్చించాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే ఇదే అంశంపై కాంగ్రెస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. దాంతో కాంగ్రెస్‌ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రైతుల సమస్యల కన్నా చర్చించాల్సిన ముఖ్యమైన అంశం ఏముందన్నారు. దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన ధ్వజమెత్తారు.పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని రైతు ఆత్మహత్యపై రాజకీయం చేయటం సరికాదన్నారు. రైతు సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, దీనిపై కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సభలో ప్రకటన చేస్తారన్నారు. రైతు ఆత్మహత్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, దిగులు చెందాల్సిన పనిలేదని వెంకయ్య తెలిపారు. ఆప్‌ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేందర్‌ సింగ్‌ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దంటూ  వెంకయ్య నాయుడుచేతులు జోడించి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రైతు ఆత్మహత్యపై ఆయన విచారం వ్యక్తం చేశారు.  దయచేసి సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వాలంటూ వెంకయ్య ముకుళిత హస్తాలతో వేడుకున్నారు. కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే  రైతు ఆత్మహత్యఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ నాయకులు  బాధ్యత వహించాలంటూ  విమర్శించారు.  దీనిపై ప్రశ్నోత్తరాల సమాయంలో  చర్చ జరగాల్సిందని  ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతి

ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఇస్తామని సభలో ఉన్న ¬ంమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ ప్రకటించినా సభ్యులు  ఆందోళన విరమించలేదు. చివరికి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ, మధ్యాహ్నం 12 గంటల తర్వాత  చర్చకు అనుమతి యిస్తామని స్పీకర్‌ మహాజన్‌  ప్రకటించిన తరువాత వివాదం సద్దుమణగలేదు. చర్చకు పట్టుబట్టడంతో సమావేశాలకు ఆటంకం కలిగింది. దాంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.

న్యూఢిల్లీలో ఆప్‌ ర్యాలీ సందర్భంగా రాజస్థాన్‌లోని దౌసాకు చెందిన రైతు గజేంద్రసింగ్‌(41) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఓ వైపు పార్లమెంటును, మరోవైపు ఢిల్లీని కుదిపేయగా  గజేంద్రసింగ్‌ అంత్యక్రియలు గురువారం ఉదయం రాజస్థాన్‌లోని అతని స్వగ్రామంలో నిర్వహించారు. అంత్యక్రియలకు ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. రాజేందర్‌ సింగ్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు.  ఆప్‌ ర్యాలీలో రైతు గజేందర్‌ సింగ్‌ ఆత్మహత్యపై ఒక వైపు పార్లమెంటర్‌ లో వివాదం నడుస్తోంటే…మరోవైపు రాజస్థాన్లోని స్వగ్రామంలో అతని అంత్యక్రియలు గురువారం ముగిసాయి. వేలాదిగా తరలివచ్చిన రాజకీయ నాయకులు,  గ్రామస్తుల అశ్రునయనాల మధ్య  గజేందర్‌ సింగ్‌ అంతిమయాత్ర సాగింది.  ఈ సందర్భంగా అతని స్వగ్రామం నంగాల్‌ జమార్వర్‌లో నల్లజెండాలు ఎగురవేశారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ , పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌  తదితరులు  ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు.  ఇది చాలా విషాదకర ఘటన అంటూ వారు నివాళులర్పించారు.  గజేంద్రసింగ్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేయడానికి తాము  వచ్చామని పలువురు నేతలు తెలిపారు. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.  ఇప్పటికైనా పంటనష్టపోయిన  రైతులను నష్టపరిహారం ప్రకటించాలని  వారు డిమాండ్‌ చేశారు. 41 సంత్సరాల గజేంద్ర సింగ్‌కు   భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రామంలో గజేంద్ర సింగ్‌  బంధువు వివాహ కార్యక్రమం ఉండటంతో ఆ పెళ్లి ప్రదర్శన (బారాత్‌) గ్రామం నుంచి వెళ్లిన  ఆ  తరువాత  మాత్రమే  సవిూపంలోని రాజ్ఘర్‌ గ్రామంలో ఉంచిన  అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.  ఇదిలా ఉంటే  పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న గజేంద్ర సింగ్‌ అంతిమయాత్రకు ఆప్‌ నేతలు ఎవ్వరూ హాజరు కాకపోవటం గమనార్హం. కాగా  ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద బుధవారం ఆప్‌ ర్యాలీ సందర్భంగా , అందరూ చూస్తుండగానే బహిరంగంగా  గజేంద్ర సింగ్‌  ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకున్న సంఘటన ప్రకంపనలు రేపింది.

న్యూఢిల్లీలో జరిగిన రైతు గజేంద్ర సింగ్‌ ఆత్మహత్య ఘటన అత్యంత విషాదకరమని, దీనిపై రాజకీయాలు అనవసరమని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. బుధవారం జరిగిన ఈ ఘటనపై గురువారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ… రైతు గజేంద్ర ఆత్మహత్య చాలా విచారకరమన్నారు. ఆత్మహత్య చేసుకోవద్దని గజేంద్రను చాలా మంది కోరారు, చెట్టువద్దకు వెళ్లి ఆపేందుకు కొందరు ప్రయత్నించారని తెలిపారు. గజేంద్ర ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రైతు ఆత్మహత్యలు చాలా సున్నితమైన విషయం.. ఇలాంటి ఘటనపై రాజకీయాలు చేయడం తగదన్నారు. అధికార, విపక్షాలు కలిసి రైతుల్లో భరోసా కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇది ఏ ఒక్కరికో సంబంధించిన వ్యవహారం కాదని, ఇది మన ఉమ్మడి బాధ్యతని అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణ దిశగా కార్యాచరణ ప్రణాళిక తెస్తామని ప్రకటించారు. గ్రామాల్లో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అయితే ఈఘటనపై విచారణకు ఆదేశించామని అన్‌ఆరు.  గజేంద్రసింగ్‌ను బతికించేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతు సమస్యలపై అధికార, విపక్ష సభ్యులు కలిసి పని చేయాలని కోరారు. మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. గత పాలకుల తప్పులు ఇప్పుడిప్పుడే సవరిస్తున్నాం. దేశ వ్యాప్తంగా రైతు ఆత్మహత్యల నివారణకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇన్నేళ్లుగా తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇవాళ ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అయితే ఈ ఘటనపై అన్ని పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి కనుక రైతు సమస్యలపై ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. అయితే కేంద్ర ¬ంమంత్రి ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విపక్ష సభ్యలు నినాదాలు చేసారు. సభలో కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ… రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే పోలీసులు ఎం చేస్తున్నారు. పోలీసులు దగ్గరే ఉన్నా ఆత్మహత్య ఎందుకు ఆపలేదు. ఢిల్లీ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉన్నాయని ఆప్‌ అంటోంది. రైతు ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలి. పోలీసుల వైఖరిపైనా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. ఆ తరవాత బీహార్‌లో జరిగిన వర్ష బీభత్సంపై చర్చకు స్పీకర్‌ అనుమతించారు.