గట్టుప్పలకు మద్దతుగా ఉంటాం: కృష్ణయ్య

నల్గొండ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): గట్టుప్పలను మండలంగా ప్రకటించేందుకు తనశాయశక్తులా సహకరిస్తామనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య హావిూనిచ్చారు. అవసరమైతే మండల విషయమై అసెంబ్లీని స్తంభింపచేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని అన్నారు. మండలం ఏర్పాటు కోసం గట్టుప్పల గ్రామస్తులు కొనసాగిస్తున్న దీక్షా శిబిరంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. మండలం వచ్చేంత వరకు దీక్షలు కొనసాగించాలని సూచించారు. 660 రోజులు నిరాటంకంగా దీక్షలను చేపట్టడం రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. దీనికి గాను ఆయన మండల సాధన కమిటీ కన్వీనర్‌ ఇడెం కైలాసంతో పాటు మండల సాధన కమిటీ సభ్యులను అభినందించారు. ఇదే విషయమై తెరటుపల్లికి వచ్చిన శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను మండల సాధన కమిటీ సభ్యులు కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయమై శాసనమండలిలో గతంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అడిగారని, ఆ విషయం సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. మరోమారు సీఎం దృష్టికి తీసుకెళ్లి మండల ప్రకటన వచ్చేలా కృషి చేస్తానని హావిూనిచ్చారు.