గడువులోగా ప్రాజెక్టులు పూర్తిచేస్తే ప్రోత్సాహకం
– జాప్యం లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయండి
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ నవంబర్20(జనంసాక్షి):
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పాలనాపరమైన జాప్యాన్ని తొలగించాలని సూచించారు. ఈమేరకు ఇవాళ ఆయన ఇరిగేషన్ అధికారులతో సచివాలయంలో సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ రాజీవ్‌శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాలమూరు, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాణహిత, దుమ్ముగూడెం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. రెండు మూడేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైతే కాంట్రాక్టర్లను మూడు షిఫ్టుల్లో పనిచేయించైనా ప్రాజెక్టుల పనిని పూర్తి చేయాలన్నారు. గడువులోగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఒక శాతం ప్రోత్సాహం ఇవ్వాలని ఆదేశించారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు డీసెంటివ్ విధించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారిక కార్యకలాపాల్లో దుబారాను అరికట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దుబారాను అరికట్టడం ద్వారా ఆదా అయిన సొమ్మును అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. మంత్రులు, శాఖాధిపతులు సమావేశం నిర్వహించుకుని తమ శాఖ పరిధిలో ఏ మేరకు ఖర్చును తగ్గించుకోవచ్చనే విషయంలో చర్చించుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలని, గతంతో పోలిస్తే పరిస్థితిలో మెరుగుదల కనిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులందరికి దుబారా ఖర్చుపై సూచనలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మని సిఎం కేసీఆర్ ఆదేశించారు.