గడువులోగా ప్రాణహిత-చేవెళ్ల

రైతులకు 50 శాతం సబ్సిడీ కింద యంత్రాలు
సీఎం కిరణ్‌ వెల్లడి
మెదక్‌ జిల్లాలో ప్రారంభమైన ఇందిరమ్మ బాట
మెదక్‌, అక్టోబర్‌ 29 : నిరసనల మధ్య తెలంగాణలో సీఎం ఇందిరమ్మ బాట కొనసాగింది. తెలంగాణపై వైఖరి వెల్లడించకుండాతెలంగాణ జిల్లాల పర్యటనకు వస్తే అడ్డుకుంటమని తెలంగాణవాదులు హెచ్చరించడంతో ముందస్తుగా పలువురు తెలంగాణవాదులన ు పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణకు లబ్ధి చేకూర్చే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలపై 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఖరీఫ్‌ నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల కోటి మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌ సోమవారం మెదక్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇందిరమ్మ బాటలో భాగంగా ఆయన మూడ్రోజుల పాటు మెదక్‌ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. తొలి రోజు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించిన సీఎం దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందిర జలప్రభ లబ్ధిదారులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. అనంతరం కిరణ్‌ ప్రసంగిస్తూ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా? లేదా? అన్నది తెలుసుకునేందుకే ఇందిరమ్మ బాట కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా రూ.26,500 వేల కోట్లుఖర్చు చేస్తున్నామని, వాటి ఫలాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా? లేదా? పరిశీలించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని, దీనివల్ల 7.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
రైతులకు అండగా ఉంటాం..
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని సీఎం కిరణ్‌ తెలిపారు. కూలీరేట్లు పెరగడంతో రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంతో చర్చిస్తున్నామన్నారు. ఉపాధి హావిూ పనులలో రైతులకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, దీనిపై మన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. ఉపాధి హావిూకయ్యే ఖర్చులోంచి 40-50 శాతం రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులకు వెచ్చించాలని కేంద్రాన్ని కోరామన్నారు. మరోవైపు, రైతులకు సబ్సిడీ ద్వారా యంత్రాలు, వ్యవసాయ పనిమట్లు అందించనున్నట్లు తెలిపారు. 50 శాతానికే ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం వచ్చే రెండేళ్లలో రూ.2.500 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే, రూ. లక్షలోపు వరకు వడ్డీ లేని రుణాలను ఈ ఖరీఫ్‌ నుంచి ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతు అసలు కడితే, వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వంపై రూ.1400-1500 కోట్ల మేర చెల్లించనుందన్నారు. దీని వల్ల కోటి మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. మొక్కజొన్న, వరి, తదితర పంటలకు గిట్టుబాట ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కిరణ్‌ చెప్పారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు.
జలయజ్ఞం పూర్తిచేస్తాం..
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే జలయజ్ఞం కింద రూ.77 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అదనంగా 21 వేల ఎకరాలను సాగులోకి తెచ్చామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో రూ.16 వేల కోట్ల మేర ఖర్చు చేసి, అదనంగా 30 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. జలయజ్ఞంపై ప్రత్యేక దృష్టి సారించి, పూర్తి చేససేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
గడువులోగా ప్రాణహిత-చేవెళ్ల
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రూ.38 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. జాతీయ ¬దా కల్పిస్తే.. 50 శాతం కేంద్రం నుంచి నిధులు వస్తాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని ఐదారు జిల్లాలకు తాగు, సాగునీరు సమస్య తీరిపోతుందన్నారు.
రూ.1800 కోట్లతో జలప్రభ
కూలీలను రైతులగా మార్చేందుకే ఇందిర జలప్రభ చేపట్టినట్లు కిరణ్‌ తెలిపారు. జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం రూ.1800 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. జుట్టు ఉంటే ఏ కొప్పైనా వేసుకోవచ్చన్నట్లుగా నీరు ఉంటే ఏ పంటైనా వేసుకోవచ్చు. అందుకే జలప్రభ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చమత్కరించారు. ఈ పథకం కింద మెదక్‌లో 80 వేల ఎకరాలు సాగులోకి తీసుకొస్తున్నాం. జిల్లాలో వెయ్యి బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. చేనేత, బీడి కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలిపారు.
విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తాం..
రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య ఉన్న మాట నిజమేనని సీఎం అంగీకరించారు. విద్యుత్‌ సక్రమంగా రావడం లేదని తామే ఒప్పుకొంటున్నామన్నారు. వాస్తవాలను నిర్భయంగా చెబుతామని, వేరే వాళ్ల దగ్గరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్టాన్రికి 250-260 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) కరెంట్‌ అవసరమని, అయితే, ఇటీవలి కాలంలో ఉత్పత్తి దారుణంగా పడిపోయిందన్నారు. ప్రాజెక్టుల్లో నీరు లేక 30 ఎంయూల జలవిద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. గ్యాస్‌ సరఫరా తగ్గిపోవడంతో 15 ఎంయూలకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోయిందని వివరించారు. మరోవైపు, డిమాండ్‌ పెరిగిందని, ఉత్పత్తి తగ్గిపోయిందని, అందుకే పరిశ్రమలకు, గృహాలకు కోతలు విధిస్తున్నట్లు తెలిపారు. గతేడాది ఇదే నెలలో కేలం 15 మిలియన్‌ యూనిట్లు మాత్రమే విద్యుత్‌ కొనుగోలు చేసి, సరఫరా చేశామని, అయితే, ఈ ఏడాది 35-40 ఎంయూల విద్యుత్‌ కొంటున్నామన్నారు. అయినా, సరిపోవడం లేదన్నారు. నార్తర్న్‌ గ్రిడ్‌ నుంచి దక్షిణ గ్రిడ్‌కు అనుసంధానిస్తే.. 350కి మెగావాట్ల కరెంట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశ ఉందన్నారు. విద్యుత్‌ సరఫరా మెరుగు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రిలయన్స్‌ నేచురల్‌ గ్యాస్‌ కొనుగోలు చేసి, విద్యుత్‌ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం నెలకు రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. యూనిట్‌కు రూ.7-8 ఖర్చు అవుతున్నా ప్రభుత్వం భరిస్తూ సరఫరా చేస్తోందన్నారు.