గడ్చిరోలి వద్ద ఎన్‌కౌంటర్
– ముగ్గురు మావోయిస్టుల మృతి
తూర్పుజిల్లా ప్రతినిధి, జూన్ 19 (జనంసాక్షి) : మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. వెంకటాపూర్-కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ అలియాస్ ఛార్లెస్ శోభన్ ఉన్నారు. గూడెం బ్రిడ్జి నిర్మాణ పనులను అడ్డుకున్న ఘటనలో శోభన్ నిందితుడిగా ఉన్నాడు.ఇతని పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. అటు ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా స్తబ్దంగా వున్న మావోయిస్టులు మళ్లీ ఒక్కసారిగా తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెలంగాణ, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు బలగాలు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక్క సారిగా మళ్లీ భయానక వాతావరణం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు సిఆర్‌పిఎఫ్ బలగాలతో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రేహౌండ్స్ పోలీసులను రంగంలోకి దింపి అటవీ ప్రాంతాల్లో అడుగడుగునా గాలింపు చర్యలు చేపట్టడంతో సరిహద్దు ప్రాంతాలు పోలీసు బూట్ల చప్పుళ్ళతో భయానక వాతావరణాన్ని తలపిస్తున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినప్పటికీ ఇంకా మావోయిస్టులు మిగిలి వున్నారా అనే కోణంలో పోలీసులు ప్రత్యేక బలగాలతో అటవీ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.