గడ్డెన్న ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద

ఎగువున వరదలతో అప్రమత్తం అయిన అధికారులు

నిర్మల్‌,జూలై19(జనం సాక్షి):ఎగువప్రాంతంలో కురిసిన భారీవర్షాల మూలంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి సోమవారం అధికంగా వరదనీరు వచ్చి చేరింది. వేకువజాములో ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో ఉదయం 4 గంటలకు మూడు వరదగేట్లను రెండువిూటర్ల మేర ఎత్తి సుద్దవాగులోకి 28,500 క్యూసెక్కుల నీటిని వది లారు. దీంతో భైంసాలోని బైపాస్‌రోడ్డు మార్గంతో పాటు పలు రోడ్లపై రాక పోకలు నిలిచిపోయాయి. సుద్దవాగు పరవాహక ప్రాంతమంతా జలమయ మయ్యింది. మధ్యాహ్నం వరుణుడి ప్రభావం తగ్గడంతో ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో తగ్గడం, అందుకు అనుగుణంగా ఎత్తిన మూడువరద గేట్లలో నుంచి ఒక వరదగేట్‌ను మూసి రెండు వరదగేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 విూటర్లు ఉండగా సోమవారం సాయంత్రం సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 357.8 విూటర్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 1.852 టీఎంసీలు ఉండగా సోమ వారం సాయంత్రం 1.380 టీఎంసీలుగా నమోదు అయ్యింది.