గతం కన్నా ఉధృతంగా హరితహారం: డిప్యూటి స్పీకర్
మెదక్,మే7(జనం సాక్షి): ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని ఉద్యమంలా కొనసాగిస్తామని, ఈయేడు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేస్తామని డిప్యూటి స్పీకర్ పద్మాదేవేంవదర్ రెడ్డి అన్నారు. ఇది సానుకూల పరిణామమని అన్నారు. గతం కన్నా ప్రస్తుతం చైతన్యం పెరిగిందని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం సాగిందన్నారు. దీనిని నిరంతరంగా కొనసాగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే వాటిని తమ సొంతబిడ్డల్లాగా సాకాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో రానున్న రోజుల్లో తెలంగాణ పచ్చని హారంలా మారుతుందన్నారు. ప్రతి గ్రామానికి కేటాయించిన మొక్కలు లక్ష్యం చేరుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం సామాజిత బాధ్యతగా గుర్తించాలన్నారు. నాటిన ప్రతి మొక్కను ఏడాది పాటు సంరక్షించాలన్నారు. అందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. మొక్కలను చంటి బిడ్డలా మాదిరిగా కాపాడుకోవాలన్నారు. వంద శాతం మొక్కలను సంరక్షించిన గ్రామాలకు ప్రభుత్వం నుంచి నజరాన ప్రకటిస్తుందన్నారు. ఇప్పటికే పలు ప్రధాన రహదారుల్లో నగర పంచాయతీ అధికారులు, పారిశుధ్య కార్మికులు, మహిళల ఆధ్వర్యంలో మూడు రోజుల్లో వేలాదిగా మొక్కలు నాటారని అన్నారు. ఇండ్ల ముందు, ఇండ్లలోని ఖాళీ స్థలంలో విధిగా మొక్కలు నాటుకోవాలని మహిళలకు సూచించారు. పట్టణంతో పాటు గ్రామాల్లో మొక్కలను నాటేందుకు మొక్కలను అందుబాటులో ఉంచామని అన్నారు. మానవాళి మనుగడకు మొక్కల పెంపకమే కీలకమని, సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడడంతో పాటు వాటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని, గతంలో ఏ ప్రభుత్వం మొక్కలు పెంపకంపై దృష్టి సారించ లేదన్నారు.
—————–