గద్దర్ ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి శేషయ్య
గద్దర్ అనే మారుపేరుతో ప్రాచుర్యం పొందిన 'గుమ్మడి విఠల్ రావు' అనే ఒక
సామాన్యమైన మానవుడు మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలోని అంటరాని దళిత కుటుంబంలో
గుమ్మడి లచ్చుమమ్మ, గుమ్మడి శేషయ్య అనే దంపతులకు 1948, జనవరి 30 నాడు
జన్మించారు. కుటుంబ సభ్యులలో అందరికన్నా చివరి వారు అయిన విఠల్ ఆరో యేట వచ్చే తల్లి
లచ్చుమమ్మతో అత్యధికంగా సాన్నిహిత్యాన్ని కలిగి ఉండేవారు. ఆమె మట్టి వాసనలు
గుబాలించే పల్లె పదాలు మరియు జానపద పాటలు చాలా బాగా పాడేవారు. విఠల్ తన తల్లి
పాడే జానపద పాటల బాణీలను బాగా అనుకరించారు. తండ్రి గుమ్మడి శేషయ్య తరచుగా విఠల్
కు 'ఆత్మగౌరవంతో జీవించాలి' అని నిర్దేశించేవారు. అంతేకాకుండా ఆయన సమతా
సమాజాన్ని కాంక్షించి ఆత్మగౌరవ పోరాటాలలో అగ్రగామిగా ఉద్యమించారు.
గుమ్మడి శేషయ్య కుటుంబానికి జీవనాధారం నిమిత్తం వ్యవసాయ భూమి లేదు.
అందువల్ల వ్యవసాయం చేయలేక బతుకు భారమై కష్టాల కడగండ్లలో కొట్టుమిట్టాడారు. ఒక
దశలో సంక్లిష్ట పరిస్థితులలో ఉన్న ఊరిలో ఉండలేక శేషయ్య పొట్టకూటి కోసం తన తల్లి (
బాలమ్మ) తో పాటు మహారాష్ట్ర ప్రాంతంలోని గోదావరి తీరానికి వెళ్లారు. ఆయన అక్కడ ఉండే
కూలీల మాదిరిగా గుడిసె వేసుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగించారు. అప్పుడు
ఆ ప్రాంతంలో బలంగా సామాజిక చైతన్యం పరిఢవిల్లుతున్న తరుణంలో శేషయ్య ఒక పక్క
కూలీ పనులకు వెళ్తూనే మరో పక్క క్రమంగా రాయడం, చదవడం నేర్చుకుని అక్షరాస్యులుగా
తీర్చిదిద్దబడ్డారు. 'చదువు అనేది ఆయనను మొట్టమొదటగా సామాజిక విముక్తుడిని
గావించింది' అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఆ విధంగా ఆయన నేర్చుకున్న చదువు
'ఆత్మగౌరవ పోరాట జీవితానికి నాంది పలికింది' అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
గుమ్మడి శేషయ్య తాను నేర్చుకున్న చదువు ద్వారా క్రమక్రమంగా అనేక
సామజిక సంఘర్షణలు అధిగమించగలిగారు. అదే క్రమంలో ఆయన భవన నిర్మాణ మెస్త్రీ గాను
పూర్తి పరిణతి చెందారు. ఔరంగబాద్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్థాపించిన మిళింద్
విశ్వవిద్యాలయం భవన నిర్మాణంలో శేషయ్య మెస్త్రీ గాను మరియు కాంట్రాక్టర్ గాను పనిచేశారు.
ఆ క్రమంలో ఆయన ప్రత్యక్షంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ని చూసి, మాట్లాడి ఎంతగానో
ప్రభావితులు అయ్యారు. దళిత కులంలో జన్మించిన శేషయ్య సహజంగానే అంబేద్కర్ భావజాలం
వైపు ఆకర్షింపబడ్డారు.
డాక్టర్ బి .ఆర్. అంబేద్కర్ ప్రబోధించిన ఆత్మగౌరవ, సామాజిక, న్యాయ, ఆర్థిక
మరియు రాజకీయ పోరాటాలు శేషయ్యని ఎంతగానో ప్రభావితం చేశాయి. అలా ఆయన క్రమంగా
అంబేద్కరిస్టుగా మారి ఒకానొక దశలో తాను సంపాదించిన ఆస్తినంతా సామాజిక కార్యక్రమాలకు
వెచ్చించారు. ఆయన అంతిమంగా 'ఆత్మగౌరవం గల వ్యక్తి'గా జీవించారు. ఆ రకంగా శేషయ్య
తాను కూడా తన పిల్లలను అంబేద్కర్ లాగా గొప్పగా చదివించి ఉన్నత స్థానాలకు
అధిరోహింపజేయాలి అని బలంగా నిర్ణయించుకుని ఆ దిశగా ముందుకు పయనించారు.
ఆరు ఏళ్ళు వచ్చే వరకు తల్లి లోకంగా జీవించిన విఠల్ ని ఆ కాలంలోనే పాఠశాలలో
చేర్పించారు. విఠల్ రెండో తరగతికి వచ్చే నాటికి తండ్రి శేషయ్య మహారాష్ట్ర నుండి తూప్రాన్
గ్రామానికి వచ్చి అక్కడే ఉండేవారు. ఈ క్రమంలోనే విఠల్ క్రమక్రమంగా తండ్రిని
అంటిపెట్టుకోవడం ప్రారంభించారు. ఆ క్రమం నుండి తండ్రి శేషయ్య పొద్దు గూకాక తన కొడుకు
విఠల్ ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సొంత పాటలు కట్టి పాడుతుండేవారు. విఠల్ అంతకు ముందే
తల్లి పాడే జానపద పాటలను అనుసరించేవారు. అలాగే అంబేద్కర్ ఉద్యమానికి సంబంధించిన
మరాఠీ పాటలు మరియు ఇతర పాటలు కూడా పాడి వినిపిస్తుండేవారు. ఆయన
అప్పుడప్పుడు తత్వాలు కూడా వినిపిస్తుండేవారు. అలాగే ఆయన వేమన శతకం, సుమతి
శతకం మరియు నృసింహ శతకాలలోని జ్ఞాన బోధల పద్యాలను విఠల్ కి లయబద్ధంగా చదివి
వినిపించేవారు. అదే విధంగా ఆయన ప్రత్యేకంగా కబీర్ గురించి ప్రస్థావించేవారు. ఆయన
అప్పటినుండి తాను ఎక్కడికి వెళ్లినా కూడా విఠల్ ని ప్రత్యేకంగా తన వెంట తప్పకుండా తీసుకొని
వెళ్లి అనేక సామాజిక విషయాల పట్ల పరిశీలనాత్మకమైన అవగాహనను కలిగింపజేశారు.
అంబేద్కర్ ప్రబోధించిన ఆత్మగౌరవ, సామాజిక, న్యాయ, ఆర్థిక మరియు రాజకీయ
పోరాటాలతో తన తండ్రి శేషయ్య తీవ్రంగా ప్రభావితులైన తీరు విఠల్ ని ఎంతగానో ఆకర్షింపజేసింది.
అంతిమంగా విఠల్ తండ్రి నుండి ఆత్మగౌరవ పోరాట ఆవశ్యకతని గుర్తించి, స్ఫూర్తి పొంది తాను
కూడా అణచివేయబడ్డ తన దళిత బహుజన జాతి విముక్తి దిశగా నడుం బిగించారు. ఆయన
ముందుగా సమాజ దార్శనికతని అలవరచుకొని తన దళిత బహుజన జాతి బతుకులను
సమున్నతంగా తీర్చిదిద్దడానికి అనునిత్యం కృషి చేశారు. ఆ రకంగా విఠల్ జీవితం చిన్ననాటి
నుండే అంబేద్కరిజం వెలుగులో 'ఆత్మగౌరవం కోసం బతుకే ఒక పోరాటం'గా ప్రజ్వలించే పోరాట
స్ఫూర్తిని రగిలింపజేయడంలో తండ్రి శేషయ్య క్రియాశీల పాత్రని నిర్వహించారు.
–
జె.జె.సి.పి. బాబూరావు
రీసెర్చ్ స్కాలర్,
సెల్: 94933 19690.