గద్వాల జిల్లాకోసం అరుణ పాదయాత్ర
మహబూబ్‌నగర్,జులై 19(జనంసాక్షి):అన్ని అర్హతలున్నా గద్వాలను జిల్లా చేయడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ అన్నారు. గద్వాల జిల్లా కోసం మంగళవారం మండలంలోని జమ్మిచేడు గ్రామ జములమ్మ ఆలయం నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించారు. రాజకీయ లబ్ధికోసమే ముఖ్యమంత్రి వనపర్తిని జిల్లా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గద్వాల ప్రజల ఆకాంక్షను గుర్తించి జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. ఏడాది కాలంగా అన్ని వర్గాల ప్రజలు గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా కోసం పోరాటాలు చేస్తుంటే తెరాస ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఇక్కడి ప్రజలను గుర్తించకుంటే వారే తెరాసకు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో గద్వాల పురపాలక ఛైర్‌పర్సన్ పద్మావతి, వైస్ ఛైర్మన్ శంకర్, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.