గమ్యం చేరే వరకు పోరుకొనసాగిద్దాం
స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డిలను అభినందించిన కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్‌ఎస్ ఆవిర్భవిం చిందని, ఆ గమ్యం చేరుకునే వరకూ పోరు కొనసాగిద్దామని ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం తనను కలిసిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డిని ఆయన అభినందించారు. ఈ సందర్భం గా కేసీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రాంత పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఎంత బలంగా చెప్పారో చూసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్లు తెరవాలన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోకుంటే రాజకీయంగా సమాధికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణవాదులు వచ్చే విజయాలతో పొంగిపోయి, పరాజయాలకు కుంగి పోవద్దని, ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే శాసన మండలి ఫలితాలే భవిష్యత్‌లోనూ పునరావృత్తమవుతా యన్నారు. ప్రతి తెలంగాణవాది ద్రోహులకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడని, దీనిని గుర్తించలేని వారు చరిత్రలో కలిసి పోతారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలను, ఉద్యమాలను వేరు చేసి చూడలేమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జై తెలంగాణ అంటూనే ఎన్నికల్లో పోటీ పడుతున్నాయని, అసలైన తెలంగాణవాదులకే ప్రజలు పట్టకడతారని స్పష్టం చేశారు. 92 శాతం మంది స్వామిగౌడ్‌కు ఓటేసి గెలిపించారంటే తెలంగాణవాదాన్ని చాటిచెప్పడానికి ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో సుధాకర్‌రెడ్డిని గెలిపించారని ఇది కాదా తెలంగాణ ఆకాంక్షకు ప్రతీక అన్నారు. అబద్ధపు ప్రచారంతో తెలంగాణను అడ్డుకోవాలని చూసే శక్తులు ఈ గెలుపుతో కళ్లు తెరవాలన్నారు.