గల్ఫ్‌ బాధితులకు ఆదుకోవాలి

KTR 3

–  కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తో మంత్రి కేటీఆర్‌ వినతి

న్యూఢిల్లీ,జులై 29(జనంసాక్షి):కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తో ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గల్ఫ్‌ దౌత్య కార్యాలయంలో తెలుగు తెలిసిన అధికారిని నియమించాలని కోరారు. పలు కారణాలతో గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయసహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరినమని వెల్లడించారు. గల్ఫ్‌ వెళ్లిన, వెళ్లాలనుకునే వారి సమగ్ర నివేదికను రూపొందించాలని భావిస్తున్నామని, దానికి కేంద్రం సహకారాన్ని కోరామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. నకిలీ ఏజెంట్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరామని తెలిపారు. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారిని, నర్సులను ప్రభుత్వ సంస్థ అయిన టామ్‌ కామ్‌ ద్వారా పంపించాలని విజ్ఞప్తి చేశామని కేటీఆర్‌ చెప్పారు.లిబియాలో అపహరణకు గురైన తెలంగాణ వాసి బలరాం కిషన్‌ విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సుష్మాకు విజ్ఞప్తి చేశామని కేటీఆర్‌ తెలిపారు. మంత్రి వెంట ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీ సుమన్‌ ఉన్నారు.అంతకుముందు ప్రాంతీయ వైమానిక మార్గాల అనుసంధానంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. కేంద్రమంత్రి అశోక గజపతి రాజు ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్‌ ను నిర్వహించారు. ఏవియేషన్‌ రంగంలో నూతన పాలసీ తీసుకొచ్చినందుకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.