గల్ఫ్‌ బాధితులను పరామర్శించి సీఎం

– దశలవారీగా స్వదేశానికి రప్పిస్తాం : శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
గల్ఫ్‌లో విజిట్‌ వీసాలతో చిక్కుకుని ఆ దేశం ప్రకటించిన ఆమెస్టీ ప్రకియ తర్వాత ఆదివారం స్వదేశానికి చేరుకున్న బాధితులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని తాము అండగా ఉంటామని దిగులు చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ గల్ఫ్‌ బాధితులను ఆదుకుంటామన్నారు. వివిధ కారణాలతో గల్ఫ్‌లో చిక్కుకున్న వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందర్ని దశలవారీగా రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శనివారం 20 మంది హైదరాబాద్‌కు చేరుకోగా ఆదివారం ఉదయం మరో 17మంది వచ్చారని తెలిపారు. మరికొంతమందిని తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నామన్నారు. వీసా గడువు ముగియడంతో జైళ్లల్లో ఉన్న వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే అధికారుల బృందం దుబాయ్‌కి చేరుకుందన్నారు. వారిని కూడా ప్రభుత్వ ఖర్చుతోనే తీసుకురానున్నట్టు తెలిపారు. వారందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. అర్హులకు శిక్షణ ఇచ్చి ప్రత్యేక ఉద్యోగాల్లో నియమింప జేస్తామన్నారు. ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని, ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు.