గాంధీజీ బాటలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమం
సిద్దిపేటలో బాపూ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట,అక్టోబర్2(జనంసాక్షి): తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన మహాత్మాగాంధీజి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన చూపిన మార్గం నేటికీ అనుసరణీయమని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం రావాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్‌లో యువ పితాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని హరీశ్‌రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్య్రం తేవడానికి మిగతా దేశాలకు గాంధీ మార్గదర్శకులు అయ్యారని తెలిపారు. గాంధీజీ పోరాటం వల్లనే ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా 14 సంవత్సరాలు అహింసాయుత పోరాటం చేసి తెలంగాణ సాధించారని స్పష్టం చేశారు. గాంధీజి కలలు కన్న గ్రామస్వరాజ్యం రావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకే కేసీఆర్ కొత్త గ్రామపంచాయతీ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి.. మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్న హరీశ్‌రావు.. గాంధీజీ కలలు కన్న మార్గంలో అందరం పయనిద్దామని పిలుపునిచ్చారు.