గాంధీభవన్‌ను వీడని ఆశావహులు


టిక్కెట్లు ఖరారు కాక నేతల్లో టెన్షన్‌
ఢిల్లీ నుంచి జాబితా వస్తేనే ఎవరెక్కడన్నది తేలేది
హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముందుస్తు ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెరాస అభ్యర్థులను ఖరారు చేసి నెలరోజులు గడిచిపోయినా.. పొత్తుల విషయం తేలకపోవడంతో టికెట్ల ఖరారు కొలిక్కిరాలేదు. పొత్తు లేకున్నా.. ఒంటిరిగానైనా పోటీ చేయడానికి సిద్ధమే అంటూ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు తమ వాణిని స్కీన్రింగ్‌ కమిటీ ఎదుట వినిపించారు. దీంతోపాటు ఆశావాహులంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. వీరు నిత్యం గాంధీభవన్‌ వద్దనే తచ్చాడుతున్నారు.
రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నారు.  మహాకూటమి పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను మాత్రం ఏఐసీసీ స్కీన్రింగ్‌ కమిటీ సిద్ధం చేసింది. బలమైన అభ్యర్థులను పోటీకి దించడానికి కమిటీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అభ్యర్థుల జాబితాను దిల్లీకి పంపించి.. ఆశావహులను బుజ్జగించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దసరా నాటికల్లా అభ్యర్థుల జాబితా ఖరారు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా గెలుపు అవకాశాలున్న అభ్యర్థులనే ఎన్నికల బరిలో దించేందుకు సన్నద్ధమైంది. పైరవీలకు తావులేకుండా రాహుల్‌ దూతల సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. టికెట్ల కోసం భారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలన అనంతరం ఇప్పటికే ఏఐసీసీ కమిటీ వడపోత కార్యక్రమం చివరి దశకు వచ్చింది. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన చోటా ఒక్కరి పేరును మాత్రమే సూచించాలని పీసీసీకే బాధ్యత అప్పగించింది. పీసీసీ ఇచ్చిన జాబితా, సర్వేలో వచ్చిన పేర్లను ఈ కమిటీ పరిశీలిస్తోంది. ఒక్కో స్థానానికి ఒక్కరి పేరుతోనే జాబితా తయారు చేసి శనివారం దిల్లీకి పంపనున్నారు. ఈ పరిణామాలన్నీ  ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. గత ఎన్నికల వరకు దిల్లీ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో చక్రం తిప్పే నాయకులు పైరవీలు చేసిన వాళ్లకే టికెట్ల కేటాయింపులు జరిగేవి. ప్రజలతో సంబంధాలు లేకపోయినా.. ఎన్నికల సమయంలో పైరవీలతో టికెట్‌ తీసుకొని బరిలో నిలిచేవారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేయడానికి రాహుల్‌ గాంధీ సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. ఆరునెలల ముందే ఆయన దూతలను రాష్ట్రానికి  పంపించి ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. పీసీసీ తొలుత నియోజకవర్గానికి ఇద్దరి పేర్లతో జాబితాను సిద్ధం చేయగా.. ఆ తర్వాత రాహుల్‌ ఆదేశాల మేరకు ముగ్గురి పేర్లతో జాబితా తయారు చేసింది. జిల్లాలో ఆసిఫాబాద్‌, నిర్మల్‌ నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని చోట్లా భారీగానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకొని అనుకూలనేతల ద్వారా పైరవీలు సాగిస్తున్నారు. టికెట్‌ తమకు వస్తుందంటే తమకే అంటూ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని తేల్చిచెప్పడంతో పైరవీలతో టికెట్లు తెచ్చుకోవాలని ప్రయత్నించిన వారి ఆశలకు అడ్డుకట్టపడినట్లేననే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రజలతో సంబంధాలున్న నేతలు మాత్రం సర్వే ఆధారంగా టికెట్లిస్తే తమకే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. ఏఐసీసీ స్కీన్రింగ్‌ కమిటీ మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీస్తోంది.  ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుపు సులువు అవుతుందని నియోజకవర్గాల వారీగా అభిప్రాయాలను సేకరించింది. ఇలా రకరకాలుగా సమాచారం తెప్పించుకుని.. ఆఖరికి సర్వేలో అనుకూలంగా వచ్చిన పేర్లతో సరిపోల్చుకుంటున్నారు.