గార్డును చంపి జైలు నుంచి పరారీ

break197bభోపాల్‌: సిమీ(స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా) ఉగ్రవాదులు బరితెగించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ సెంట్రల్‌ జైలులో దారుణానికి ఒడిగట్టారు. భోపాల్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్టీల్‌ కంచంతో గార్డుగా వ్యవహరిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ను గొంతు కోసి హతమార్చారు. అనంతరం దుప్పట్ల సాయంతో నిచ్చెన ఏర్పాటు చేసుకుని జైలు గోడ దూకి పరారయ్యారు. పరారైన వారిని షేక్‌ ముజీబ్‌, మజీద్‌, ఖలీద్‌, అకీల్‌ ఖిల్జి, జాకిర్‌ హుస్సేన్‌, మహ్మద్‌ సలీక్‌, షేక్‌ మహబూబ్‌, అంజద్‌లుగా పోలీసులు గుర్తించారు. సిమీ ఉగ్రవాదుల పరారైన సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పరారైన 8 మందిలో నలుగురు నిందితులు 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జైలు నుంచి కూడా ఇలాగే పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

సిమి మాజీ అధినేత అబు ఫైజల్‌ 2015లో ఓ ఏటీఎస్‌ కానిస్టేబుల్‌ హత్యకేసులో అరెస్టై ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గార్డును చంపి జైలు నుంచి పరారైన ఘటనలో మాస్టర్‌మైండ్‌ ఇతనేనని పోలీసులు భావిస్తున్నారు.

ముస్లింల సంక్షేమం కోసం సిమి పేరుతో 1977లో సంస్థ ఏర్పాటచేశారు.2001లో ప్రభుత్వం సిమిను నిషేధించినా ఇప్పటికీ ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులు అండర్‌గ్రౌండ్‌ నుంచి నెట్‌వర్క్‌ నడుపుతున్నట్లు సమాచారం.

ఐదుగురు సిబ్బందిపై వేటు
సిమీ ఉగ్రవాదుల పరారైన ఘటనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి భూపేంద్ర సింగ్‌ ఆదేశాలు జారీచేశారు.

రాజ్‌నాథ్‌ ఆరా
సిమీ ఉగ్రవాదుల పరారీ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరా తీశారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.