గిరిజన,ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు ఆపారు


మోడీ సమాధానం చెప్పాలన్న కెసిఆర్‌
నేనెవరితోనూ కలవాల్సిన ఖర్మ లేదు
కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి
సాగర్‌లో జానారెడ్డిని  ఓడించాలి
హాలియా సభలో కెసిఆర్‌ ఉద్ఘాటన
నాగార్జునసాగర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఆపారో దమ్ముంటే జవాబు చెప్పాలని మోదీకి కేసీఆర్‌ సవాల్‌ చేశారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సరికాదన్నారు.నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత గిరిజనులు, ముస్లింల సంఖ్య పెరిగిపోయింది. అందుకే వారికి రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నాం. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు ఎందుకు ఆపావో మోదీ చెప్పాలి. దమ్ము, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పే మోదీ ఇక్కడి నుంచి వెళ్లాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఏది ఏమైనా ఆ రిజర్వేషన్లను సాధించేందుకు కృషి చేస్తాం. కాంగ్రెసోళ్లు వచ్చి కేసీఆర్‌ బీజేపీతో కలిసిపోయిండు అంటారు. బీజేపీ వాళ్లు వచ్చి కాంగ్రెస్‌ కలిసిపోయిండు అని అంటున్నారు. నేనేవరితో
కలిసిపోలేదు. విూరు మమ్మల్ని కాపాడుతారనే నమ్మకం ఉంది. అందుకే ఒంటరిగా పోటీ చేస్తున్నాం. 100పై చిలుకు స్థానాలతో టీఆర్‌ అధికారంలోకి వస్తుంది. 17 ఎంపీ స్థానాల్లో కూడా మనమే గెలవాలి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వమే అధికారంలోకి రావాలి. ప్రజల ఎజెండా అమలు చేసే నాయకత్వమే కేంద్రంలో అధికారంలోకి రావాలి. అందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇకపోతే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని ఇంటికి పంపాలన్నారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు కింద నెల్లికల్‌ వద్ద లిప్ట్‌ కావాలి. గవర్నమెంట్‌ వచ్చిన తెల్లారే మంజూరు చేస్తాను నెల్లికల్‌ లిప్ట్‌. నెల్లికల్‌ లిప్ట్‌ ఆరేడు నెలల్లో పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. జానారెడ్డిని ఎన్నేండ్లు గెలిపిస్తరు. మార్పు చేయండి. నర్సింహయ్యను గెలిపియ్యండన్నారు. ఆయన సిపిఎంలో పనిచేసిన పెద్ద నాయకుడని, నిజాయితీ కలిగిన నేత అన్నారు. ఆయకట్టును పెంచుకోండి. అభివృద్ధికి తోడ్పాటును అందించండి. హాలియా వద్ద చెక్‌ డ్యాంను ఏర్పాటు చేస్తాం. హాలియాలో డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని కేసీఆర్‌ హావిూనిచ్చారు. సాగర్‌ లో ఉన్న బౌద్ధ క్షేత్రానికి నిధులిచ్చి ఆధునీకరిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇకపోతే కేంద్రాన్ని చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడతారేమో కానీ తాను భయపడనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.యాభై ఏళ్లు కాంగ్రెస్‌ పాలన ఒకవైపు నాలుగున్నరేళ్ల తెరాస పాలన ఒకవైపు ఉంది. విూరు బేరేజు వేసుకోవాలి. ఎన్నికలు వచ్చాయంటే అందరూ పోటీ చేయడం సహజం. పరిణతి జరిగిన ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం గెలవాలి. మనదేశంలో ఇంకా ఆ పరిపక్వత రాలేదు. రావాల్సిన అవసరం ఉంది. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పెంచి ఇస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశంలో ఎక్కడా లేవు. కేసీఆర్‌ ఉన్నంతవరకూ రైతు బంధు పథకం ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్‌, నీటి సరఫరా సమస్యలు పరిష్కరించామని అన్నారు. కంటి వెలుగు పథకం పక్కనున్న తెలుగు రాష్ట్రంలో కూడా లేదు. కేవలం కంటితో మిమ్మల్ని వదలి పెట్టను. గొంతు, ముక్కు, పళ్ల డాక్టర్లు కూడా వస్తారు. ప్రజలందరి రక్తం శాంపిళ్లు తీసుకుని పరీక్షలు చేస్తారు. ఆ డేటాను భద్ర పరుస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయా వ్యక్తులకు అందాల్సిన వైద్య సహాయం నిమిషాల్లో అందేలా చర్యలు తీసుకునేందుకు ఈ పరీక్షలు ఉపయోగ పడతాయి. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతాం. మోదీకి మతం బీమార్‌ ఉంది. ఓ వర్గం ప్రజలంటే ఆయనకు పడదు. దేశ ప్రధాని అయిన ఆయన తెలంగాణకు వచ్చి ఈ బక్క సీఎంపై విరుచుకుపడుతున్నాడు. ఇక్కడకు వచ్చిన సభలో కనీసం సగం మంది కూడా ప్రధాని సభకు రాలేదన్నారు.
ఒక్క నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో 70 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశాం. నెల్లికల్లు లిప్ట్‌ కూడా పూర్తి చేసి ఇక్కడి వారికి నీళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తా. మళ్లీ తెరాస అధికారంలోకి రాగానే హాలియాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. బీఈడీ కళాశాల గురించి కూడా మాట్లాడతా. ఎప్పుడూ జానారెడ్డిని గెలిపించడమేనా? ఈసారి నోముల నర్సింహయ్యను గెలిపించాలని ప్రజలను కోరుతున్నా. ఆయన పోరాట పార్టీ అయిన కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. ప్రజల తరపున నిలబడతారు అని కేసీఆర్‌ నాగార్జునాసాగర్‌ ఓటర్లను కోరారు.

తాజావార్తలు