గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
మహబూబ్ నగర్ (జనం సాక్షి): గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తుందని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని నేరాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఊట కుంట తండాలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా తండా వాసులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి గిరిజనులనుద్దేశించి మాట్లాడుతూ..తెలంగాణ ఆవిర్భావంతో రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి వల్ల బీజాలు పడ్డాయన్నారు. ప్రత్యేకించి గిరిజన సమగ్రాభివృద్ధికి కృషి జరుగుతున్నని తెలిపారు. మా తండాల్లో, మా రాజ్యం అనే గిరిజన నినాదాన్ని నిజం చేస్తూ, తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నారని, ఆ ప్రక్రియ పూర్తి కావస్తుందన్నారు. త్వరలోనే తండాలు జీపీలు గా మారుతాయని పేర్కొన్నారు. గిరిజనులు తెలంగాణ ఉద్యమంలోనే గాక, తెలంగాణ పునర్నిర్మాణంలోను కీలక భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు.పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతున్నాయని లక్మారెడ్డి తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల నీటితో ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలోని అనేక చెరువులు నిండాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. బాలానగర్ మండలంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతాయన్నారు. అద్భుతమైన ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయని వెల్లడించారు. పలు ఆరోగ్య, అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి లక్ష్మారెడ్డి గిరిజనులకు వివరించారు. త్వరలోనే బాలానగర్ మండలములో 30 పడకల వైద్యశాల ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, గ్రామ, తండా ప్రజలు పాల్గొన్నారు.