గిరిజన చట్టాలను.. మోడీ, కేసీఆర్ తుంగలో తొక్కారు
– అధికారంలోకి రాగానే అటవీ హక్కు చట్టాన్ని అమలుచేస్తాం
– గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందజేస్తాం
– ప్రాజెక్టుల రీడిజైన్‌లతో జేబులు నింపుకోవటమే కేసీఆర్ పని
– సింగరేణిను ప్రైవేటు పరం కానివ్వం
– భూపాలపల్లి సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
భూపాలపల్లి, నవంబర్29(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆశలు నెరవేరుతాయని ప్రజలు భావించారని, కానీ ఆ ఆశలు నెరవేరలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భూపాలపల్లి జిల్లాలో ప్రజాకూటమి నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో గిరిజనుల రక్షణచట్టం తీసుకొచ్చామని, జల్, జంగిల్, జవిూన్‌పై గిరిజనులకు హక్కు కల్పించామన్నారు. అయితే గిరిజనుల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కేసీఆర్ అమలుచేయలేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్.. గిరిజనుల హక్కులు కాలరాశారని రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేస్తామని హావిూ ఇచ్చారు. గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందజేస్తామన్నారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న సింగరేణి కార్మికులను కేసీఆర్ మోసం చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. కార్మికులకు కేసీఆర్ ఎన్నో హావిూలు ఇచ్చి మర్చిపోయారని, డిస్మిస్డ్ కార్మికులను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని రాహుల్ భరోసా ఇచ్చారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు విద్య, వైద్యం అందిస్తామన్నారు. సింగరేణి కార్మికుల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ హావిూ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను రీడిజైన్ చేసి జేబులు నింపుకోవడమే కేసీఆర్ పనిఅని రాహుల్ విమర్శించారు. కాంట్రాక్టర్లు, కుటుంబీకుల జేబులు నింపేందుకే ఇదంతా కేసీఆర్ చేస్తున్నారని ఆయన అన్నారు. 17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందని, ప్రస్తుతం కానీ తరువాత 2లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు అప్పుల్లో ఉంటే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆదాయం నాలుగు వందల శాతం పెరిగిందని ఆయన చెప్పారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం కానీయబోమని రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు. అయినా కేసీఆర్ వారిని కూడా మోసం చేశారని రాహుల్ అన్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హావిూలు నిజమైనవా? కావా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెంపరరీ, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామన్నారు. డిస్మిస్ అయిన కార్మికుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని రాహుల్ తెలిపారు.