గిరిజన ప్రాంతాలలో వైద్యం సిబ్బంది అప్రమత్తం
ఆదిలాబాద్,జూలై 20 : గిరిజన ప్రాంతాలలో వ్యాధులు ప్రబల కుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య అధికారి మాణిక్యరావు పేర్కొన్నారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలలో అంటు వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని, గిరిజన ప్రాంతాలలో వైద్య ఉద్యోగులు స్థానికంగా ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశామని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాలలో పారిశుద్ద్యం లోపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు గాను ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 10 వేల రూపాయలను మంజూరు చేస్తామని అన్నారు. సీిజనల్ వ్యాధులు అయిన మలేరియా, టైఫాయిడ్్, డెంగీ, అతిసారం తదితర వ్యాధులను ప్రాథమిక దశలోనే నివారించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉంచామని అన్నారు. రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు 12 అంబులెన్సులను అందుబాటులో ఉంచామని అన్నారు. ఎప్పటికప్పుడు నివేదికలను జిల్లా కార్యాలయానికి తెప్పించి సమీక్షిస్తామని అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు గురి కావద్దని, వ్యాధుల విషయమై అప్రమత్తంగా ఉంటూ వైద్య సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.