గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థ

కేంద్ర ఐటీ మంత్రి కిల్లి కృపారాణి
హైదరాబాద్‌, మార్చి 28 (జనంసాక్షి):
గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్టపరచేందుకు రెండు వేల కొత్త టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి ప్రకటించారు. ఐటీ రంగం ఎదు ర్కొంటున్న సవాళ్ళు-అవకాశాలపై శుక్రవారంనాడు వ్యాపారవేత్తలతో ఫ్యాప్సీ ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కిల్లికృపారాణి మాట్లాడుతూ రూ.3వేల కోట్ల వ్యయంతో ఈ సిగ్నల్‌ వ్యవస్థను మారుమూల గ్రామాలకు విస్తరించనున్నట్లు ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఐటీ ఎగుమతుల్ని పెంచేందుకు ఐటీ ఇన్వెస్టిమెంట్‌ రీజియన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల ఈ రంగం నుంచి అత్యధిక మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో 39శాతం ఐటీ రంగం నుంచే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.